
- గ్రూప్ 1 క్యాండిడేట్లకు 6 నెలల పాటు రూ.5 వేలు
- గ్రూప్ 2, ఎస్సై క్యాండిడేట్లకు 3 నెలల పాటు రూ.2 వేలు
- బీసీ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో 1.25 లక్షల మందికి ఫ్రీ కోచింగ్
- ఈ నెల 16 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్లు
- అదే రోజు ఎంట్రెన్స్ ఎగ్జామ్, రిజల్ట్స్: మంత్రి గంగుల
హైదరాబాద్, వెలుగు: గ్రూప్స్, ఎస్సై అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టైపెండ్ ఇవ్వనున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. 10 వేల మంది గ్రూప్-1 అభ్యర్థులకు ఆరు నెలల వరకు నెలకు రూ.5 వేల చొప్పున.. గ్రూప్-2, ఎస్‌ఐ అభ్యర్థులకు మూడు నెలల పాటు రూ.2 వేల చొప్పున ఇస్తామని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు బీసీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో 1.25 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఫ్రీ కోచింగ్ ఇవ్వనున్నట్లు గంగుల చెప్పారు. 25 వేల మందికి ఆఫ్‌లైన్‌లో, 50 వేల మందికి ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తామని.. మరో 50 వేల మందికి ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో ఇస్తామని తెలిపారు. ఉచిత శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 16న ఉదయం 11 గంటలకు ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహించి, గంట తర్వాత ఫలితాలిస్తామని పేర్కొన్నారు. ఎగ్జామ్ రాసేందుకు 16న ఉదయం 10 గంటల వరకు ఆన్ లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. 20 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీసీలకు 75%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5%, ఈబీసీలకు 5%, మైనారిటీలకు 5% రిజర్వేషన్లు ఉంటాయన్నారు.
మరో 5 స్టడీ సర్కిళ్లు..
రాష్ట్రంలో ప్రస్తుతం 11 బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నాయని గంగుల చెప్పారు. కొత్తగా సిరిసిల్ల, జగిత్యాల, సూర్యాపేట, నర్సంపేట, వనపర్తిలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో స్టడీ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దాతలు ముందుకొస్తే మరిన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. అభ్యర్థులు studycircle.cgg.gov.in, mjpabcwreis.cgg.gov.in, unacademy.com/scholarship/tsgovt-scholarship-test అనే వెబ్‌సైట్లలో అన్ లాక్ కోడ్ UNACADEMY10 ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.