ఆంధ్ర పార్టీలకు తెలంగాణలో పనేంటని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రశ్నించారు. ఆదివారం స్థానిక 16,46వ డివిజన్లలో రూ.72.8కోట్ల అభివృద్ధి పనులకు మేయర్ సునీల్ రావుతో కలిసి భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఢిల్లీ పాలకులు విషం చిమ్ముతున్నారని ఆరోపించారు. ఎన్ని పాదయాత్రలు చేసినా, కుప్పిగంతులు వేసినా ఒక్క ఓటు కూడా ఆంధ్ర పార్టీలకు పడదని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ఆఫీస్ నుంచి కేసీఆర్ కు అధికారికంగా ఒక్క మెసేజ్ కూడా రాలేదని గుర్తు చేశారు. మోదీ ఓ ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడారని అన్నారు.
రామగుండంలోనూ రాజకీయాలా?
రామగుండంలోనూ ప్రధాని రాజకీయాలు చేశారని మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణ నుంచి రూ.కోట్లు జీఎస్టీ చెల్లిస్తే, ఫలాలు మాత్రం గుజరాత్ కు పంచడం ఏంటని ప్రశ్నించారు. ఉత్తరాది రాష్ట్రాలతోపాటు దక్షిణాదిని కూడా సమానంగా చూడాలన్నారు. తెలంగాణలో అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చుక్కెదురవుతుందని, తెలంగాణ గడ్డను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శ్రీకాంత్, శ్రీదేవి, ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, డీఈ మసూద్ అలీ పాల్గొన్నారు.
విశ్వబ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట..
కరీంనగర్ రూరల్: కరీంనగర్ రూరల్ మండలం మొగ్దుంపూర్ లో రూ.50 లక్షలతో నిర్మిస్తున్న విశ్వబ్రాహ్మణ వసతి గృహం మిగులు పనుల నిర్మాణానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారితో కలిసి ఆదివారం భూమి పూజ చేశారు. విశ్వబ్రాహ్మణులైన ప్రొఫెసర్ జయశంకర్, శ్రీకాంతాచారి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో కుల వృత్తులకు సీఎం కేసీఆర్ జీవం పోశారని, విశ్వబ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనానికి హైదరాబాద్ ఉప్పల్ భగాయత్‌లో 5 ఎకరాల భూమితో పాటు భవన నిర్మాణానికి రూ.5 కోట్లు కేటాయించారని మంత్రి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 41 బీసీ కులాలకు ఉప్పల్ కోకాపేట్ లో 82.7 ఎకరాల స్థలంలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాకముందు 19 గురుకులాలు ఉండేవని, ఇపుడు 310 గురుకులాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి నిధుల నుంచి రూ.50 లక్షలు కేటాయించారని, బిల్డింగ్నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని మినిస్టర్పేర్కొన్నారు. కార్యక్రమాల్లో జడ్పీటీసీ లలిత, లక్షయ్య, సర్పంచ్ నర్సయ్య, కరీంనగర్ ప్యాక్స్ చైర్మన్ శ్యాంసుందర్ రెడ్డి పాల్గొన్నారు.