- ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ మానేరులో ఏర్పాటుచేస్త
- ముస్లింలకు చెక్కుల పంపిణీ
కరీంనగర్ టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోపే మిగిలిన పనులన్నింటిని పూర్తిచేసి, కరీంనగర్ లో మరో ప్రపంచాన్ని చూపిస్తానని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో ప్రపంచంలోనే అతిపెద్ద ఫౌంటెయిన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. దుబాయ్ బోట్లను ఇప్పటికే తెప్పించామని తెలిపారు. అత్యంత సుందరనగరంగా తీర్చిదిద్దేందుకు చైనా వంటి దేశాలకు వెళ్లి అధ్యయనం చేశామని పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ లో ముస్లింలకు మేయర్ సునీల్ రావు, కలెక్టర్ గోపితో కలిసి మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ముస్లింలను ఆదుకునేందుకే మైనారిటీ ఆర్థిక మద్దతు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. రాష్ట్రంలో గొడవలు, బంద్ లు, కర్ఫ్యూలు లేకుండా శాంతియుత వాతావరణం ఉందని, అందువల్లే అమెజాన్, గూగుల్ లాంటి ప్రపంచ దిగ్గజ కంపెనీలు తెలంగాణకు వస్తున్నాయన్నారు. మైనారిటీ బంధు నిరంతర ప్రక్రియ, ప్రతినెలా లబ్ధిదారులకు చెక్కులను అందిస్తామని చెప్పారు.
ఈ క్రమంలో జిల్లాలోని కరీంనగర్, హుజురాబాద్, చొప్పదండి, మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాలకు చెందిన 174 మంది లబ్ధిదారులకు రూ.1.74 కోట్ల చెక్కులు,650 మందికి కుట్టుమెషీన్లను మంత్రి పంపిణీ చేశారు. కలెక్టర్ డాక్టర్ బి.గోపి మాట్లాడుతూ జిల్లాలో 6,329 మంది మైనారిటీ బంధు కోసం దరఖాస్తు చేసుకోగా,174 మందికి మొదటి విడతలో చెక్కులను అందించామని తెలిపారు. మిగిలిన వారికి కూడా అందిస్తామని చెప్పారు. కాగా, రెవెన్యూ గార్డెన్స్ లో 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న 175 మంది వికలాంగులకు 211ఉపకరణాలను మంత్రి గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, ప్రఫుల్ దేశాయ్, ఆర్డిఓ కె.మహేశ్ తదితరులు పాల్గొన్నారు.