
- ఏపీలో పక్కాగా పాగా వేస్తం
- కేసీఆర్ జోలికొస్తే ఖబర్దార్
- సజ్జలకు గంగుల వార్నింగ్
కరీంనగర్ టౌన్, వెలుగు: గుజరాత్, కర్నాటకతో పాటు ఏపీలోనూ కేసీఆర్ పెట్టబోయే జాతీయ పార్టీ పక్కాగా పాగా వేస్తుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం స్థానిక మీ సేవ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి టీఆర్ఎస్ కుటుంబంతో పాటు హరీశ్ రావుపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడం తగదని, రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. బీజేపీకి వైఎస్ఆర్సీపీ ‘బీ’ పార్టీగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.
కేసీఆర్ జోలికి వస్తే ఖబర్దార్.. అని హెచ్చరించారు. గతంలోనే తామేంటో సజ్జలకు చూపించామని, మళ్లీ ఎందుకు పెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. వైఎస్ ఫ్యామిలీలోకి సజ్జల వచ్చి.. తల్లీ కొడుకు, అన్నాచెల్లెలు మధ్య చిచ్చు పెట్టి విడగొట్టారని ఆరోపించారు. అదే తరహాలో కేసీఆర్ కుటుంబాన్ని విడగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. పాలనలో జగన్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిందని, అందుకే తెలంగాణకు వలసలు పెరుగుతున్నాయన్నారు. కేసీఆర్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం జోలికి వస్తే దాడులు చేస్తామని హెచ్చరించారు.