ఏపీ నాయకులు తెలంగాణ సంపదపై కన్నేసిన్రు: గంగుల కమలాకర్

ఏపీకి చెందిన నాయకులంతా తెలంగాణ సంపదపై కన్నేశారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వైఎస్ బిడ్డ షర్మిల కొత్త ముసుగులో ఇక్కడికి వచ్చిందని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్, కేఏపాల్ కూడా అలాగే వచ్చారన్నారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటర్ అయ్యారంటూ విమర్శించారు. వీరంతా ఒకే అజెండాతో ఇక్కడికి వస్తున్నారని .. మళ్లీ రాష్ట్రాన్ని కలపాలని చూస్తున్నారని గంగుల మండిపడ్డారు. మళ్లీ 1956 నవంబర్ 1వ తేదీని గుర్తు చేస్తున్నారని చెప్పారు. 

ఏపీ మూలాలు ఉన్న మీకు తెలంగాణ గడ్డ పై ఏం పనంటూ గంగుల కమలాకర్ ప్రశ్నించారు. రెండు రాష్ట్రాలు జూన్ 2నే ఏర్పడినా చంద్రబాబు ఆరోజు ప్రమాణం చేయలేదని గంగుల గుర్తుచేశారు. ఖమ్మం నుంచి ఏడు మండలాలు కలిపేదాకా ప్రమాణం చేయనన్న చంద్రబాబు.. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్నాడని ఆయన ఆరోపించారు. వీరందరి వెనక బీజేపీ ఉందంటూ విమర్శలు చేశారు. హైదరాబాద్ సంపదను ఎత్తుకుపోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు మేల్కొని తిరుగుబాటు మొదలుపెట్టాలని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నరని ఆరోపించారు. బీఆర్ఎస్‭తో తాము దేశమంతా పోతుంటే..  తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారని ప్రశ్నించారు. కర్ణాటకలోకో, తమిళనాడులోకో చంద్రబాబు ఎందుకు పోవడం లేదన్నారు.