- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్: ప్రతిపక్షాలకు అభివృద్ధి చేయడంతోనే సమాధానం చెబుతామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. నగరంలో 5.50 కోట్ల రూపాయలతో పద్మానగర్ నుంచి ఒద్యారం వరకు సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి గంగుల కమలాకర్ భూమి పూజ చేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, సుడా చైర్మన్ జివి. రామక్రిష్ణ రావు, మేయర్ సునీల్ రావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం మా బాధ్యత అన్నారు. అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ లేదు అనకుండా నిధులను విడుదల చేస్తున్నారని.. తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా వైట్ లెడ్ లైట్ల స్థానంలో ఎల్లో కలర్ వార్మ్ లెడ్ లైట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. మంచు పడుతున్న సమయంలో కూడా ఈ లైట్ల వెలుతురులో రోడ్డు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కరీంనగర్ నుండి వేములవాడ వెళ్లే ఈ ప్రధాన రహదారిలో ప్రతి పోల్ పై ఢమరుకం ఉండేలా డిజైన్ చేశామని.. కరీంనగర్ నుండి సిరిసిల్ల వరకు 100 కోట్లతో రోడ్డును అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు. 60 లక్షల సూడా నిధులతో రోడ్డుకు ఇరువైపులా... మధ్యలో... మూడు వరుసల్లో మొక్కలు నాటుతున్నామని మంత్రి చెప్పారు. ప్రతిపక్షాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే తిరిగి మేమూ మాట్లాడితే అర్ధముండదు... వారికి అభివృద్ధితోనే సమాధానం చెబుతామని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు.