గౌడ కులంలో పుట్టి బహుజనుల హక్కుల కోసం పోరాడిన ఘనత సర్దార్ సర్వాయి పాపన్నదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్ ప్రకటనను స్వాగతిస్తూ కరీంనగర్ తెలంగాణ చౌక్ లో గౌడసంఘం నేతలు నిర్వహించిన సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అందరి హక్కుల కోసం పోరాడిన సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహించాలని గత 30ఏళ్లుగా గౌడన్నలు పోరాడుతున్నారని చెప్పారు.
సమైక్య పాలనలో సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు నాటి పాలకులకు మనసు రాలేదని గంగుల అన్నారు. అయితే బలహీన వర్గాల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నెల 18న సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
దేశభక్తి పెంపొందించే విధంగా వజ్రోత్సవాలు
స్వాతంత్య్ర వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటి పై జాతీయ జెండా ఎగరాలని గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 8 నుండి 20 వరకు దేశభక్తి పెంపొందించే విధంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు..ఈ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.ప్రతి ఇంటికి జాతీయ జెండాలను ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పారు.