సోదాలు నిర్వహిస్తున్న ఈడీ, ఐటీ సంస్థలకు సంపూర్ణ సహకారం అందిస్తానని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. దర్యాప్తు సంపూర్ణంగా చేయాలని, నిజానిజాలు తేల్చాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థలదేనని స్పష్టం చేశారు. తాను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఈడీ అధికారులు వచ్చారని, ఇంటి తాళాలు తీయమని చెప్పింది తానేనన్నారు. ఇంట్లోని ప్రతి లాకర్ని ఓపెన్ చేసి చూసుకొమ్మని చెప్పినట్లు మంత్రి పేర్కొన్నారు. సోదాల్లో ఎంత క్యాష్ దొరికిందో, ఏమేం స్వాధీనం చేసుకున్నారో దర్యాప్తు అధికారులే చెప్పాలన్నారు. మైనింగ్, రాయల్టీకి సంబంధించిన అంశాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనివని చెప్పారు.
బయటి దేశాల నుంచి డబ్బులు హవాలా మార్గంలో తెచ్చామా అనేది ఈడీ.. డబ్బులు అక్రమంగా నిల్వ ఉంచామా అనేది ఐటీ విభాగం చూస్తోందన్నారు. వీటికి సంబంధించి తమ సంస్థల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని మంత్రి గంగుల తేల్చి చెప్పారు. ‘‘గతంలోనూ చాలాసార్లు, చాలా మంది, ఈడీ, ఐటీలకు ఫిర్యాదు చేశారు. మేం స్వాగతించాం. పారదర్శకంగా, ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం నిర్వహిస్తున్నాం. ఇటువంటి సమయంలో దగ్గరుండి దర్యాప్తునకు సహకరించాలనే ఉద్దేశంతో నేను వెంటనే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చేశాను’’ అని ఆయన చెప్పారు.