తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 21 నుంచి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభం అవుతున్నట్టు వార్తలు సోషల్ మీడియా గ్రూపుల్లో షికారు చేశాయి. ఏకంగా పలువురు ప్రజాప్రతినిధులు, మంత్రలు ఫొటోలతో దరఖాస్తులకు కావాల్సిన పత్రాలు ఇవే నంటూ పోస్టర్లు దర్శనమిచ్చాయి. అయితే ఈ వార్తలపై మంత్రి గంగుల కమలాకర్ స్పందించారు.
వాస్తవం కాదు..ఇదీ నిజం
నూతన రేషన్ కార్డుల జారీపై వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. అవన్నీ తప్పుడు ప్రచారాలని చెప్పారు. ఆ వార్తలను నమ్మొదని ప్రజలకు సూచించారు. రాష్ట్రంలో ఏ విధమైన రేషన్ కార్డుల ప్రక్రియ మొదలు కాలేదని స్పష్టం చేశారు. అదంతా ఫేక్ ప్రచారమని దానికి ఎవరూ నమ్మవద్దని ప్రకటించారు. తప్పుడు పోస్టులను ఎవరూ షేర్ చేయవద్దని సూచించారు. ప్రజలను అయోమయానికి గురిచేసేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మంత్రి గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎలాంటి ప్రచారమంటే..
తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను అందిస్తోందందటూ వాట్సాప్, ఇతర సోషల్ మీడియాలో గ్రూపుల్లో వార్తలు వచ్చాయి. ఆగస్టు 21 నుండి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు ప్రారంభం కానుందంటూ పోస్టర్ చక్కర్లు కొట్టింది. ఇప్పటికే రేషన్ కార్డు లేనివారు లేదా పాత రేషన్ కార్డులో పేరు లేదా అడ్రస్ తప్పుగా ఉంటే.. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని పోస్టర్ లో పేర్కొన్నారు.
ఈ పత్రాలు కావాలంటూ..
కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, చిరునామా రుజువు పత్రం, ఆదాయ రుజువు(ఇన్‌కం సర్టిఫికేట్) కావాలని పోస్టర్ లో వెల్లడించారు. ఈ దరఖాస్తును జిల్లా రేషన్ కార్డ్ కార్యాలయంలో ఇవ్వాలని పేర్కొన్నారు.