- వడ్ల కొనుగోలుకు 1,277 సెంటర్లు
- ఇప్పటికే 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరణ: మంత్రి గంగుల
- నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అధికంగా కొనుగోళ్లు
- శుక్రవారం నాటికి 1.27 లక్షల టన్నుల ధాన్యం సేకరించాం : మంత్రి గంగుల
- నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధిక కొనుగోళ్లు
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా 1,277 యాసంగి వడ్ల కొనుగోలు సెంటర్లు ప్రారంభించామని సివిల్ సప్లయ్స్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ వెల్లడించారు. ఈ కేంద్రాలలో శుక్రవారం నాటికి రూ.262 కోట్ల విలువైన 1.27 లక్షల టన్నుల వడ్లు సేకరించామని చెప్పారు. మంత్రి కరీంనగర్‌లోని తన నివాసంలో శుక్రవారం సివిల్ సప్లయ్స్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో అధికంగా కొనుగోళ్లు జరుగుతున్నట్లు తెలిపారు. వరికోతలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు స్థానిక యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. టార్గెట్‌కు అనుగుణంగా వడ్ల సేకరణకు 7,031కి పైగా కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు.
గన్నీ బ్యాగులు, మాయిశ్చర్, వేయింగ్ మిషన్లు, హమాలీలను సమకూర్చుకున్నామని తెలిపారు. అకాల వర్షాల నేపథ్యంలో టార్పాలిన్లను సైతం అందుబాటులో ఉంచామని మంత్రి వెల్లడించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వం సిద్ధం చేసినట్లు చెప్పారు. ప్రపంచంలో బియ్యం ఉత్పత్తి 20 ఏండ్ల కనిష్టానికి పడిపోతుంటే, కేవలం రాష్ట్రంలోనే ఉత్పత్తి ఆరింతలు పెరిగిందని తెలిపారు. ఈ సమీక్షలో సివిల్ సప్లయ్స్ కమిషనర్ అనిల్ కుమార్, సంస్థ జీఎం రాజిరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.