కరీంనగర్, వెలుగు: రాష్ట్రం ఆవిర్భవించిన దశాబ్ది కాలంలోనే ఆధ్యాత్మికత, అభివృద్ధి, ఆహ్లాదానికి కేరాఫ్ గా కరీంనగర్ జిల్లా నిలిచిందని బీసీ సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. 'మన కోసం – మన కరీంనగర్ కోసం' నినాదంతో కరీంనగర్ రన్నర్స్ అండ్ సైక్లిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం నిర్వహించిన మారథాన్ ను కేబుల్ బ్రిడ్జి వద్ద మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
కలెక్టర్ గోపి, సీపీ సుబ్బరాయుడుతో కలిసి బ్రిడ్జ్ పై మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో కరీంనగర్‌కు కల్లోలిత ప్రాంతంగా పేరుండేదని, ఈ జిల్లాకు ట్రాన్స్ఫర్ అంటేనే అధికారులు పనిష్మెంట్‌గా భావించేవారని గుర్తుచేశారు. ఐటీ టవర్, మెడికల్ కాలేజీ, టీటీడీ ఆధ్వర్యంలో వేంకటేశ్వర స్వామి, శ్రీకృష్ణుని టెంపుల్ నిర్మాణాలతో భావితరానికి అద్భుతమైన నగరాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు.
అనంతరం సిటీలో సీఎంఏ గ్రాంట్స్ రూ.133.84 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేటర్లు పిట్టల వినోద, జయలక్ష్మీ, శ్రీకాంత్, శ్రీలత, షర్ఫోద్దీన్, ఇఫ్రాత హరీన్ అథీనా పాల్గొన్నారు.