కాళేశ్వరంతో మండుటెండల్లోనూ మత్తడులు

కాళేశ్వరంతో మండుటెండల్లోనూ మత్తడులు
  • 897 చెరువుల్లోకి 2.3 కోట్ల చేప పిల్లలు

 

కరీంనగర్ టౌన్, కరీంనగర్ సిటీ, వెలుగు: జిల్లాలోని 897 చెరువుల్లోకి రూ.1.62 కోట్ల విలువైన 2.3 కోట్ల చేపపిల్లల్ని వదిలామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. సోమవారం స్థానిక మానేరు జలాశయంలోకి ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి చేప పిల్లల్ని వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీలి విప్లవంతో రాష్ట్రంలో చేపల దిగుమతి నుంచి ఎగుమతి స్థాయికి చేరుకున్నామని అన్నారు. కాళేశ్వరం జలాలతో మండుటెండల్లోనూ చెరువులు మత్తడులు దూకుతున్నాయన్నారు. 

ఈ క్లాస్ రూమ్స్ ప్రారంభం..
స్థానిక నగరపాలక సంస్థ ఆఫీస్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా మంత్రి ఈ క్లాస్ రూమ్స్ ను ప్రారంభించారు. ప్రస్తుతం 10స్కూళ్లలో ఈ క్లాస్ రూమ్స్ ద్వారా విద్యను అందిస్తున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ లో భాగంగా నగరవ్యాప్తంగా 335 సీసీ సర్వెలెన్స్ కెమెరాలను అమర్చి 110 లొకేషన్స్ లో  కమాండ్ కంట్రోల్ సిస్టమ్ కు అనుసంధానం చేశామన్నారు. అనంతరం నగరంలోని కలెక్టరేట్​  ఆడిటోరియంలో జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. అనంతరం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 133 మంది కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు రూ. కోటీ 33 లక్షల 15,428 విలువ గల చెక్కులను మంత్రి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పంపిణీ చేశారు. 

ఎల్ఐసీ పోరాటానికి సంఘీభావం
కొన్ని రోజులుగా ఎల్ఐసీ ఉద్యోగులు చేపడుతున్న శాంతియుత పోరాటానికి మంత్రి గంగుల సంఘీభావం ప్రకటించారు. సోమవారం స్థానిక మంకమ్మతోటలోని ఎల్ఐసీ ఆఫీస్ ఎదుట ఉద్యోగులు చేపడుతున్న ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కరీంనగర్​కలెక్టర్ కర్ణన్, కమిషనర్ ఇస్లావత్, డి​ప్యూటీ మేయర్ స్వరూపారాణి , జెడ్పీ చైర్ పర్సన్ విజయ, కార్పొరేటర్లు మాధవి, జయశ్రీ, శ్రీకాంత్, శ్రీనివాస్, తిరుపతి, కళ్యాణి, సుడా చైర్మన్ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

వేములవాడ గుడి చెరువులో..
వేములవాడ: స్థానిక గుడి చెరువులో ఎమ్మెల్యే రమేశ్​బాబు, జడ్పీ చైర్ పర్సన్ అరుణతో కలిసి సోమవారం చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం అందిస్తోందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్​ పర్సన్ మాధవి, మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు శంకర్ తదితరులు పాల్గొన్నారు.