కేసీఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయ్ : మంత్రి గంగుల 

రైతులెవరూ మధ్యవర్తులకు వరి పంటను అమ్ముకోవద్దని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వరి ధాన్యం కొనుగోళ్లను వేగంగా చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 7100 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వరి పంటకు మద్దతు ధర చెల్లిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని చెప్పారు. ఇకపై రైస్ మిల్లర్ల వేధింపులు ఉండవని, ఒక బ్యాగ్ కి 40 కిలోల మీద 600 గ్రాములు మాత్రమే తూకం వేస్తాం అని పేర్కొన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 41 కిలోల చిల్లర తూకం వేస్తున్న విషయం తెలుసుకుని అధికారులను గంగుల కమలాకర్ హెచ్చరించారు. దేశంలో రెండో పంట కొంటున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమే అని చెప్పారు. సీఎం కేసీఆర్ యాగాలు చేస్తే.. ప్రతిపక్షాలు అడ్డు తగులుతున్నాయని, ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు అని చెప్పారు. 

‘నాటి కాలంలో దేవుళ్ళు యజ్ఞాలు చేస్తే రాక్షసులు రక్తాన్ని పోసేవారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాల యజ్ఞం చేస్తుంటే ప్రతిపక్షాలు కుట్రలనే రక్తాన్ని పోస్తున్నారు. పచ్చని తెలంగాణలో చిచ్చు పెట్టేందుకు కుట్రలు చేస్తున్న ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు. రైతులకు చిన్న ఇబ్బంది కలిగినా సీఎం కేసీఆర్ తట్టుకోలేరు’ అంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. 

రాష్ట్రంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి గంగుల కమలాకర్ ఆదేశించారు. సమైక్య రాష్ట్రం పాలనలో సాగునీరు లేక సగం భూములు బీడు పెట్టిన రోజులే ఉండేవన్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో మండుటెండల్లోనూ చెరువులు కళకళలాడుతున్నాయని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న వ్యవసాయ సంక్షేమ పథకాలతో తెలంగాణలో భూమికి బరువయ్యే పంటలు పండుతున్నాయన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని సూచించారు.