రేవంత్​తో చంద్రబాబే మాట్లాడిస్తుండు : గంగుల కమలాకర్

రేవంత్​తో బాబే మాట్లాడిస్తుండు

2018 నాటి మహాకూటమి ఇంకా కొనసాగుతోంది: గంగుల   

కరీంనగర్, వెలుగు : వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ మూడు గంటలే చాలని పీసీసీ చీఫ్ రేవంత్ మాట్లాడారని, ఆయనతో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడే అలా మాట్లాడించారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. వారిద్దరూ ఇప్పటికీ గురుశిష్యులేనని, తెలంగాణపై ఇంకా ద్వేషం వెళ్లగక్కుతున్నారని ఫైర్ అయ్యారు. మంగళవారం కరీంనగర్ లోని తెలంగాణ చౌక్ లో రేవంత్ దిష్టిబొమ్మకు బీఆర్ఎస్ నాయకులు ఉరి వేసి నిరసన తెలిపారు. కార్యక్రమంలో మంత్రి గంగుల మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ ఇచ్చిందని, అప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తామని చెప్పకనే చెప్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆ పార్టీకి మూడు సీట్లే ఇవ్వాలని రైతులను కోరారు. 

రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం 

బీఆర్ఎస్ నాయకులు ఉరివేసిన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నేత, ఎమ్మెస్సార్ మనువడు రోహిత్ రావు తన అనుచరులతో కలిసి మంగళవారం సాయంత్రం తొలగించారు. అనంతరం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు రేవంత్ దిష్టిబొమ్మను తీసుకెళ్లారు.