ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

కరీంనగర్ టౌన్,వెలుగు: క్రిస్మస్ పండుగను శాంతి సామరస్యంతో ఘనంగా నిర్వహించుకుందామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. శాంతితో ప్రపంచం ముందుకు సాగాలనే క్రీస్తు సూచనలను పాటిస్తూ క్రైస్తవులంతా పండుగను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. జిల్లాలోని ప్రధాన జంక్షన్లు, కూడళ్లు, చర్చిలను అందంగా తీర్చిదిద్దుకోవాలన్నారు. కొత్తపల్లిలో జరిగే క్రిస్మస్ వేడుకలకు అయ్యే ఖర్చును  తాను భరిస్తానని మంత్రి ప్రకటించారు. క్రిస్మస్ పండుగకు 2 రోజులు సెలవు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దేనని, దీనివల్ల మతాలన్నింటిని సీఎం సమదృష్టితో చూస్తారని వెల్లడైందని చెప్పారు. పండుగ విశిష్టతను పెంచేలా ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్టులు అందిస్తుందని, నియోజకవర్గానికి రూ.2లక్షల విలువ చేసే 1000 కానుకలను సమకూర్చిందన్నారు. సమావేశంలో మేయర్ సునీల్ రావు, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, ఎంపీపీ లక్ష్మయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్, తహసీల్దార్ సుధాకర్, క్రిస్టియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

హెల్త్ హబ్ గా  సిటీని తీర్చిదిద్దుకుందాం

కరీంనగర్ సిటీని హెల్త్ హబ్ గా మార్చుకుందామని మంత్రి కమలాకర్‌ అన్నారు. ఆదివారం స్థానిక నెహ్రూ చౌరస్తా సమీపంలో జనరల్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ మౌనికారెడ్డి, రేడియాలజిస్టు డాక్టర్‌ నరేందర్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఎంఎన్‌ఆర్‌ ఆస్పత్రిని మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో గుండె, కిడ్నీ తదితర జబ్బులు వస్తే హైదరాబాద్‌కు వెళ్లి వైద్యం చేయించుకునేవాళ్లని, ఇపుడు కరీంనగర్‌లోనే అన్ని రకాల సూపర్‌ స్పెషాలిటీ వైద్యం అందుబాటులో ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రసాద్, శ్రీలత, ఆస్పత్రి నిర్వాహకులు అభిలాశ్​రెడ్డి, హరికృష్ణ పాల్గొన్నారు. 

కుల వృత్తులకు ప్రభుత్వ ప్రోత్సాహం 

జగిత్యాల, వెలుగు : ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల రూరల్ మండలం కల్లెడ గ్రామంలో రూ.6.60 లక్షలతో నిర్మించిన గౌడ సంఘం భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జడ్పీ చైర్ పర్సన్ వసంత తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హరిత హరంలో భాగంగా ఈత, తాటి, మొక్కలు నాటించామని, గీత కార్మికులకు పింఛన్, ఎక్స్ గ్రేషియా పెంచామని గుర్తు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో రాయికల్ పట్టణానికి చెందిన కౌన్సిలర్ మ్యాకల కాంతారావు అధ్వర్యంలో సుమారు 40 మంది బీఅర్ఎస్ లో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు బాల ముకుందం, పాక్స్ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ మహేశ్వర రావు, ఎంపీటీసీ పరశురాం, గౌడ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ పాల్గొన్నారు. 

నూతన దంపతులను ఆశీర్వదించిన వివేక్

పెద్దపల్లి, వెలుగు: జిల్లా కేంద్రానికి చెందిన బండారు సునీల్ వివాహానికి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్, పెద్దపల్లి మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన దంపతులను ఆయన ఆశీర్వదించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్లు గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి, బాలసాని సతీశ్, ఉనుకొండ శ్రీధర్, అడ్డగుంట శ్రీనివాస్, గంగుల సంతోష్, సోడాబాబు, క్రాంతి తదితరులున్నారు. 

ఫ్రెండ్ ​వైద్యం కోసం విరాళాల సేకరణ

గన్నేరువరం, వెలుగు: మండల కేంద్రానికి చెందిన టేకు అంజలి(13) బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుండడంతో తోటి స్నేహితులు మండలకేంద్రంలో విరాళాలు సేకరించారు. అంజలి స్థానిక జడ్పీహెచ్ఎస్ లో 6వ తరగతి చదువుతోంది. వైద్యం కోసం సుమారు రూ.40 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటంబీకులైన అంజలి తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆదివారం తోటి విద్యార్థులు అక్షిత, సిరి చందన, అక్షిత్ గౌడ్, విష్ణుప్రియ, శైలజ, చైత్ర, మనవిత కలిసి అంజలి వైద్యం కోసం తమవంతు సహాయం చేస్తున్నారు. మండలంలో తిరిగి విరాళాలు సేకరిస్తున్నారు. స్నేహితురాలికి వీరు చేస్తున్న సహాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. 

చర్మ వ్యాధులతో కుక్కల స్వైరవిహారం

కరీంనగర్ పట్టణంలో ఏ వీధిలో చూసిన వింత వ్యాధి సోకిన కుక్కలు గుంపులుగుంపులుగా సంచరిస్తున్నాయి. ఇప్పటికే వానరాల బెడదతో నగరవాసులు ఇబ్బందులు పడుతుండగా ఇప్పుడు శునకాలు రోడ్డుపై స్వైరవిహారం చేస్తున్నాయి. వ్యాధులు సోకిన కుక్కల చర్మమంతా ఊడిపోతుండడంతో ఆ వైరస్​తమకు సోకుతుందేమోనని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. విచ్చలవిడిగా కుక్కలు రోడ్లపై తిరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. -  వెలుగు పోటో గ్రాఫర్‍, కరీంనగర్

వానరానికి అంత్యక్రియలు 

ముత్తారం,వెలుగు : వానరానికి అంత్యక్రియలు చేసిన ఘటన ముత్తారం మండలంలోని అడవి శ్రీరాంపూర్ లో జరిగింది. గ్రామానికి చెందిన మర్రి రాజ కొమురయ్య ఇంటి సమీపం వద్ద ఆదివారం ఓ వానరం మృతి చెందింది. దీంతో గ్రామ సర్పంచ్ తుంగాని సమ్మయ్య, జీపీ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో వానరానికి అంత్యక్రియలు నిర్వహించారు. డప్పు చప్పుళ్లతో ఊరేగించి ఖననం చేశారు. వార్డు సభ్యుడు బైరి రాజమ్మ తదితరులు పాల్గొన్నారు.