కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగిందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీడు భూములు కూడా సాగులోకి వచ్చాయన్నారు. గతంలో 90 వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వస్తే.. ఈసారి 3లక్షల 33వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయ్యిందన్నారు. వరి ధాన్యం దిగుబడి మూడు రేట్లు పెరిగి.. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా రాష్ట్రం అవతరించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలతో రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు. వివిధ రకాల సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తుందని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రైవేటీకరణ చేయడాన్ని ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించమని చెప్పారు.
రేషన్ బియ్యం పక్కదారి పట్టిస్తే కఠిన చర్యలు
రేషన్ బియ్యాన్ని (పీడీఎస్ రైస్) కొందరు పక్క దారి పట్టిస్తున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. పీడీఎస్ రైస్ పక్కదారి పట్టకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకుని.. అరికట్టాలని సూచించారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై జిల్లా కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వరి ధాన్యం రాష్ట్రంలోని ఐకేపీ కేంద్రాలకు రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటివరకు ఆసరా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకొని వారు మళ్లీ వెబ్ సైట్ ఓపెన్ అయిన తర్వాత దరఖాస్తు చేసుకోవాలన్నారు.
ఏకగ్రీవంగా తీర్మానం..
కరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో.. జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జెడ్పీ సీఈవో ప్రియాంక కర్ణన్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. శంకరపట్నం మండలంలోని దళితకాలనీల్లో అధికారులు విద్యుత్ కనెక్షన్లను తొలగిస్తున్నారని కొందరు జెడ్పీటీసులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి గంగుల.. తొలగించిన విద్యుత్ సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని ఆదేశించారు. గతంలో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరకే వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.