కరీంనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో తాగునీటికి ఇబ్బందులున్నాయని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని రాంనగర్ మహిళా సంఘం భవన్ లో శుక్రవారం మంత్రి కమలాకర్ బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీజేపీ నేతలు చెప్పేవన్నీ అబద్ధాలని అన్నారు. మిషన్ భగీరథ పథకంతో రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా మంచి నీరు అందించామని తెలిపారు. రైతు బంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, దళిత బంధు, ఆసరా పెన్షన్ల వంటి పథకాలతో సంక్షేమంలో రాష్ట్రం దేశంలో ముందుందన్నారు.
రాష్ట్ర పండుగలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వచ్చే ఎన్నికల్లో గెలిచేది మాత్రం టీఆర్ఎస్ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు.