తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్రం తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. ఇవాళ కరీంనగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై మరోసారి కేంద్ర ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధమవుతున్నామన్నారు. సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్రాన్ని పోరాడి సాధించుకున్నాం. కాళేశ్వరం జలాలను తీసుకొచ్చి ఉనికిని కోల్పోయిన చెరువులను బతికించామని మంత్రి తెలిపారు.
తెలంగాణ ప్రజల ధైర్యంతోనే ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రైతాంగం ధాన్యాన్ని పండిస్తే... ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసే బాధ్యత కేంద్రానిది. మీ పాలిత రాష్ట్రాల్లో ఏం అభివృద్ధి చేశారని ఇక్కడ అధికారం కావాలని వస్తున్నారు అని ప్రశ్నించారు. అధికారం కోసం మతాల మధ్య ఘర్షణలు పెట్టిన ఘనత కాంగ్రెస్, బీజేపీ పార్టీలదని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 60 శాతం మంది ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారు. పచ్చగా.. సుస్థిరంగా ఉన్న తెలంగాణపై కాంగ్రెస్, బీజేపీలు విషం చిమ్ముతున్నాయని మంత్రి ఆరోపించారు.
తెలంగాణను కుక్కలు చింపిన విస్తరిలా మార్చేందుకు సీమాంధ్ర పాలకులు ఇంకా కుట్రలు పన్నుతున్నారని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఏపీకి సాగునీటి కోసం తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును కూడా కూల్చేందుకు వారు వెనుకాడబోరు అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను కాపాడే దమ్ము కేవలం కేసీఆర్ కు మాత్రమే ఉందన్నారు. తెలంగాణ గడ్డ మనది. మన తెలంగాణను, మన ప్రభుత్వాన్ని మనమే కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.వైయస్ షర్మిల, కేఏ పాల్ తెలంగాణకు ఎందుకు వస్తున్నారో వారికే తెలియాలి అన్నారు. కాంగ్రెస్, బీజేపీలు ఢిల్లీ పార్టీలు టీఆర్ఎస్ మన ఇంటి పార్టీ వ్యాఖ్యానించారు.
తెలంగాణ అభివృద్ధి చెందుతుంటే మీకు ఎందుకు కల్లమంట... కడుపు మంట? అని మంత్రి కమలాకర్ ప్రశ్నించారు. తెలంగాణలోనే కరీంనగర్ ను తల తలలాడే నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు. నూతన పాలకవర్గం రైతులకు అండగా ఉండాలి.. వారికి దెబ్బ తాకితే ఆ నొప్పి మీరు అనుభూతి చెందాలి అన్నారు. పదవి కోసం కాకుండా..పార్టీ కోసం జెండా పట్టుకున్న వారికే పదవులు లభిస్తాయని స్పష్టం చేశారు. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టిన రైతులకు భారం కానివ్వం..కేంద్రంతో తాడోపేడో తెల్చుకుంటామని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.