తెలంగాణలో ఆంధ్ర నాయకులకు ఏం పని అని మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. వైఎస్ షర్మిల, పవన్ కల్యాణ్, చంద్రబాబు తెలంగాణకు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. వారి పాలనను తెలంగాణ ప్రజలు కోరుకోవడం లేదని చెప్పారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో సంతోషం లేకుండా చేస్తున్నారని అన్నారు. కరీంనగర్ టీఎన్జీవో భవన్ లో ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు.
అవకాశమొస్తే రెండు రాష్ట్రాలను కలుపుతామని కొందరు అంటున్నారని.. అలా ఎలా కలుపుతారని గంగుల నిలదీశారు. వారు తెలంగాణ గడ్డ మీద అడుగుపెడితే.. పాత ఆంధ్రప్రదేశ్ అవిర్భావ దినోత్సం గుర్తుకొస్తుందన్నారు. ఆ విషయం తలుచుకుంటేనే భయమేస్తోందని..అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. దోచుకుందాం కలిసి పంచుకుందామనేదే వారందరి టార్గెట్ అన్నారు. ఈ విషయంలో మరోసారి టీఎన్జీవోలు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రానున్న రోజుల్లో ఉద్యోగుల ఆశలన్నీ తీరుతాయని చెప్పారు.