- ఢిల్లీ పాలకులు వస్తే మన కరెంట్, బొగ్గు ఎత్తుకపోతరు
- కాంగ్రెస్ టికెట్లతో రౌడీలు, దొంగలొస్తున్నరని కామెంట్స్
కరీంనగర్, వెలుగు : బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే ఢిల్లీ పార్టీల వాళ్లు తెలంగాణను ఆంధ్రలో కలుపుడు ఖాయమని రాష్ట్ర బీసీ సంక్షేమం, సివిల్ సప్లైస్ శాఖల మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇప్పటికే షర్మిల, కేవీపీ, కిరణ్ కుమార్ రెడ్డిలాంటి వాళ్లు హైదరాబాద్ లో నాసు పెట్టుకుని కూచున్నారన్నారు. కరీంనగర్ జిల్లా కిసాన్ నగర్ లోని వ్యవసాయ మార్కెట్ లో ఏఎంసీ చైర్మన్ రెడ్డవేణి మధు అధ్యక్షతన నిర్వహించిన రైతు సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఎన్నికలు వస్తుండడంతో ఢిల్లీలో ఉండే కాంగ్రెస్, బీజేపీ పార్టీల వాళ్లు తెలంగాణలో మళ్ల మోపయితున్నరని అన్నారు.
ఢిల్లీ పాలకులు మనకొద్దని, హైదరాబాద్ లో ఉండే కేసీఆరే తెలంగాణ ప్రజలకు రక్ష అని స్పష్టం చేశారు. ఢిల్లీ పాలకులు వస్తే మన కరెంట్, బొగ్గు ఎత్తుకపోతరని.. దొంగలకు సద్దులకు కట్టొద్దని రైతులకు సూచించారు. కాంగ్రెస్ టికెట్లతో పోటీ చేసేందుకు 20, 30 కేసులు ఉన్న రౌడీలు, దొంగలు వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాష్ట్రంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకించానని, కేసీఆర్ కట్టిన కాళేశ్వరంతోనే ఇది సాధ్యమైందన్నారు.
కాగా, కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ గ్రామంలో యాదవ సంఘం నాయకుడు దివంగత కాల్వ నర్సయ్య యాదవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సందర్భంగా కూడా మంత్రి మాట్లాడారు. ఇస్కాన్ వారితో కలిసి కరీంనగర్ లో రూ.20 కోట్లతో శ్రీకృష్ణుడి ఆలయాన్ని నిర్మించనునున్నామని, ఇందుకోసం 3 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు.