కాంగ్రెస్‌‌‌‌కు ఓటేస్తే కర్నాటక ప్రజల్లాగే మోసపోతరు : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు : కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేస్తే కర్నాటక ప్రజల్లాగే రాష్ట్రవాసులు మోసపోతారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ హెచ్చరించారు. కరీంనగర్ లోని మీ సేవ ఆఫీసులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కర్నాటకలో కాంగ్రెస్‌‌‌‌కు అధికారమిస్తే కరెంట్ ఇవ్వలేక ఆ రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. బెంగళూరులో రోజూ 7 గంటల కరెంట్ కోత విధిస్తున్నారని, వ్యవసాయానికి 2 గంటలే ఇస్తుండడంతో పంటలు ఎండుతున్నాయన్నారు. ఎవరో  రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్ గాంధీ చదువుతున్నారే తప్ప.. అందులోని నిజానిజాలను గ్రహించడం లేదన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చే రూ.80వేల కోట్లు కాగా రూ.లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఆయన మంథని నుంచి కొంచెం ముందుకు పోతే కాళేశ్వరం వచ్చేదని, ఆ ప్రాజెక్టును చూస్తే ఎంత అద్భుతమైన ప్రాజెక్టో తెలిసేదన్నారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు ఒకే విధానం ఉండాలని, కానీ రాష్ట్రానికో తీరుగా విధానాలను మార్చుకుంటోందని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో సుమారు 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. బీసీ గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. 

వెయ్యి మంది కూడా రాలే..

రాహుల్ గాంధీ కరీంనగర్ వస్తే వెయ్యి మంది కూడా రాలేదని, వారిలోనూ చాలా మంది అటువైపు షాపింగ్ కు వచ్చినవారే ఉన్నారని మంత్రి గంగుల ఆరోపించారు. దీంతో రాహుల్ గాంధీ పట్టుమని 10 నిమిషాలు కూడా మాట్లాడలేదని, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అసలే మాట్లాడలేదన్నారు. సమావేశంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, లీడర్లు అనిల్ కుమార్ గౌడ్, మధు, హరిశంకర్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.