సీఎం కేసీఆర్ను బద్నాం చేసే కుట్ర : మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలో జరు గుతున్న పేపర్ లీకేజీల వెనక బీజేపీ పెద్దల పాత్ర ఉందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తొమ్మిదిన్నరేండ్లలో టెన్త్ మొదలు పీజీ వరకు ఎన్నో పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా నిర్వహిం చిందని గుర్తు చేశారు. కేవలం అధికార దాహంతో తెలంగాణలో చిచ్చుపెట్టి, సీఎం కేసీఆర్ ను అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్ లోని తన ఆఫీసులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించని వ్యక్తి బండి సంజయ్ అని విమర్శించారు. తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై మొదట పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయనకు లేదా అని ప్రశ్నించారు. బీజేపీ కి సంబంధించిన గ్రూపులు, సోషల్ మీడియాలో వైరల్ చేయడం వెనక బీజేపీ కుట్ర స్పష్టమవుతోందన్నారు. లక్షలాది మంది స్టూడెంట్ల ఉసురు కచ్చితంగా బీజేపీకి, సంజయ్ కి తగులుతుందన్నారు.
పేపర్ల లీకేజీల్లో కేంద్రం పాత్ర : మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు
వరంగల్, వెలుగు : బీజేపీ డ్రామాలు తప్పితే.. రాష్ట్రంలో ఎటువంటి పేపర్ లీకేజీల్లేవని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు అన్నారు. బుధవారం హనుమకొండ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో ఏ1 గా ఉన్న బండి సంజయ్ పోలీసులకు తన ఫోన్ ఎందుకివ్వలేదని దయాకర్‍రావు ప్రశ్నించారు. సంజయ్ ఫోన్ పోలీసుల చేతికి వస్తే చాలా విషయాలు బయటకొస్తాయన్నారు. లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీకి తన ఫోన్లు ఇచ్చాక.. అప్పటివరకు మాట్లాడిన బండి సంజయ్, రేవంత్‍రెడ్డి నోర్లు మూతపడ్డాయన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న లీకేజీల్లో సంజయ్‍తో పాటు కేంద్రం పాత్ర ఉందని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో ఉన్న రాజశేఖర రెడ్డి కూడా బీజేపీ వ్యక్తే అన్నారు. ఇప్పుడూ టెన్త్పేపర్ లీకేజీ లో ఏకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే ఉన్నాడన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‍భాస్కర్, ఆరూరీ రమేశ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, బీఆర్‍ఎస్ పార్టీ అంటే ప్రధాని మోడీ, అమిత్ షా వణుకుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీకి కౌంట్ డౌన్ స్టార్టయిందని.. బీఆర్‍ఎస్ స్పీడ్ తట్టుకోలేరన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‍రెడ్డి, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‍రెడ్డి, నన్నపునేని నరేందర్ ఉన్నారు.
మోడీ, షా డైరెక్షన్లోనే పేపర్ల లీకేజీ : సబిత
వికారాబాద్, వెలుగు: కేసీఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేమని ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా టీఎస్ పీఎస్సీ, టెన్త్ పరీక్ష పేపర్ల లికేజీ కుట్రకు పాల్పడ్డారంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఆమె మీడియాతో మాట్లాడారు. మోడీ, అమిత్ షా ప్లాన్లో భాగంగానే రాష్ట్రంలో ఎంపీ బండి సంజయ్ పేపర్ల లికేజీ లకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. స్వార్థ రాజకీయాల కోసం 5 లక్షల మంది టెన్త్స్టూడెంట్ల జీవితాలతో వారు చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. వరుసగా పేపర్ల లికేజీ చేస్తూ ప్రభుత్వాన్ని ఆస్థిర పరచాలనే కుట్రకోణాన్ని పోలీసులు పసిగట్టి సంజయ్ ను అరెస్టు చేసినట్లు వివరించారు. టీఎస్ పీఎస్సీ పేపర్ల లీక్నిందితుడు రాజశేఖర్, టెన్త్ పేపర్ లికేజీలో పాత్ర ఉన్న ప్రశాంత్ కు బీజేపీ నాయకులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. స్టూడెంట్లు, 30లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను నాశనం చేస్తున్న బీజేపీ నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. వికారాబాద్ జిల్లా తాండూరులో టెన్త్ పేపర్ లిక్ చేసిన టీచర్ కూడా బీజేపీ అనుబంధ సంఘం సభ్యుడని చెప్పారు.