
- టార్గెట్ యూత్.. ఇతర పార్టీల్లోని యూత్లీడర్లపై మంత్రి గంగుల ఫోకస్
- బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లోని చురుగ్గా ఉన్న క్యాడర్‌కు గాలం
- యువతలో బీఆర్ఎస్‌పై వ్యతిరేకతను తగ్గించుకునే ప్లాన్
- బీఆర్ఎస్ కనుసన్నల్లో వినాయక మండపాల ఏర్పాటుకు చర్యలు
కరీంనగర్, వెలుగు: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంత్రి గంగుల కమలాకర్ కరీంనగర్ నియోజకవర్గంలోని యువ ఓటర్లపై ఫోకస్ చేశారు. ఉద్యోగ, ఉపాధి కల్పన విషయంలో రాష్ట్ర సర్కార్‌పై యువతలో తీవ్ర వ్యతిరేకత ఉండడంతో ఆ వర్గంపై మంత్రి ఫోకస్‌పెట్టారు. ఇందులో భాగంగా బీజేపీ, కాంగ్రెస్‌లో యాక్టివ్‌గా ఉండే యూత్ లీడర్లను పార్టీలో చేర్చుకునే పనిలో పడ్డారు. ఈ మధ్య జరుగుతున్న చేరికల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారు. బీఆర్ఎస్ లో వివిధ స్కీమ్ లతో లబ్ధిపొందినవారు, 50 ఏళ్లు పైబడినవాళ్లే ఎక్కువగా ఉంటారనే అపోహలకు చెక్ పెట్టేందుకే యూత్ చేరికలపై మంత్రి ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్ అనుబంధ వింగ్‌తోపాటు గంగుల కమలాకర్(జీకే) యూత్ పనిచేస్తోంది.
ప్రత్యర్థి పార్టీలను బలహీనపరిచే ప్లాన్
సర్కార్‌పై వ్యతిరేకతతో కొంతకాలంగా యూత్బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వైపు చూస్తోంది. ఆ పార్టీలకు సోషల్ మీడియాలో ఈ వర్గమే సపోర్ట్‌గా నిలుస్తోంది. ఇటీవల నిరుద్యోగ యువతను ఆకట్టుకునేందుకు బీసీ కులవృత్తులకు చేయూత, మైనార్టీ బంధు, దళిత బంధులాంటి స్కీములు తీసుకొచ్చినా అవి చాలా తక్కువ మందికి చేరాయి. ఆసరా, రైతుబంధు, రైతు బీమా లాంటి స్కీమ్‌లన్నీ 50, 60 ఏళ్లుపైబడినవారికే అమలుచేసేవి.
ఐదేళ్లలో నమోదైన కొత్త ఓటర్లను, నిరుద్యోగ యువతను ఆకట్టుకునే స్కీమ్ లేవీ సర్కార్ దగ్గర లేకపోవడంతో ఆ సెక్షన్ బీఆర్ఎస్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. ముఖ్యంగా కుల ఫెడరేషన్ లోన్లు, స్వయం ఉపాధి ప్రోగ్రామ్స్ లేకపోవడంతో అధికారిక పార్టీపై యువత గుర్రుగా ఉన్నారు. సుమారు 30 శాతం ఉండే 35 ఏళ్లలోపు ఓటర్ల ప్రభావం వచ్చే ఎన్నికల ఫలితాలపై ప్రభావం తీవ్రంగా ఉండనుంది. అందుకే గంగుల కమలాకర్ కాంగ్రెస్‌తోపాటు బీజేపీ అనుబంధ బీజేవైఎం, ఏబీవీపీలో పనిచేస్తున్న లీడర్లకు పొలిటికల్‌గా తాను అండగా ఉంటానని, భవిష్యత్‌పై హామీ ఇస్తూ బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు.
బీఆర్ఎస్ యూత్ ఆధ్వర్యంలోనే గణేశ్ మండపాలు..
వినాయక నవరాత్రులు వేదికగా యూత్‌ను సమీకరించడం, వారికి వినాయక విగ్రహాలతోపాటు ఇతర ఖర్చుల కోసం పార్టీ నుంచి స్పాన్సర్ చేయాలని పార్టీ హైకమాండ్నిర్ణయించింది. ఈ మేరకు కరీంనగర్‌లోనూ గణేశ్ఉత్సవాలపై మంత్రి గంగుల నజర్ పెట్టినట్లు తెలిసింది. ఇప్పటికే ఉత్సవ సమితులకు అన్నిరకాల సాయం అందించే బాధ్యతను లోకల్ లీడర్లు, కార్పొరేటర్లకు అప్పగించగా.. వారు లోకల్ యూత్‌తో టచ్‌లోకి వెళ్తున్నారు.
గణేశ్మండపాల్లో స్థానికులతో కలిసి పూజలు చేయడం, వినాయక విగ్రహాలు కొలువుతీరింది మొదలు నీళ్లలో పడేవరకు బీఆర్ఎస్ లీడర్లే అంతా తామై చూసుకోనున్నారు. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేస్తూనే గణేశ్ ఉత్సవ సమితిల్లో ఉండేవారితో కలిసి భక్తులకు సర్వీస్ చేయనున్నారు. ఇదే యూత్ ను ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా పనిచేయించుకునేలా ప్లాన్ చేస్తున్నారు.
చేరికలపై నజర్
బీఆర్ఎస్ లో ఊహించని చేరికలుంటాయని ఆగస్టు 13న మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఇందుకు తగ్గట్టుగానే బీజేపీ, కాంగ్రెస్ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న యూత్ లీడర్లు, కార్యకర్తలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటున్నారు. ఈ నెల 3న మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్ సమక్షంలో బీజేపీ, బీజేవైఎం నుంచి జూపల్లి ధీరజ్, ప్రత్యూద్, సాయి రాయల్, రాజు సింగ్, మనోజ్, దీపక్‌తోపాటు 150 మంది యువకులు చేరగా.. ఆదివారం బీజేపీ, ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మంథెన కిరణ్ ఆధ్వర్యంలో గోస్కుల మహేశ్, పరాంకుశం త్రినాథ్, శీలం అజయ్, చిగుర్ల అజయ్, పెట్టెం సుధాకర్, ప్రకాశ్ ఆచార్య, బూర్ల హేమంత్, ప్రసన్న కృష్ణతోపాటు 300 మంది హిందూ వాహిని, బీజేవైఎంకు చెందిన కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు.