కరీంనగర్ టౌన్, వెలుగు: వచ్చే ఏడాది జూన్ లోపు పట్టణంలో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులన్నీ పూర్తిచేస్తామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం స్థానిక 6,30వ డివిజన్లలో కొనసాగుతున్న పనులను మేయర్ సునీల్ రావుతో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పట్టణంలో స్మార్ట్ సిటీ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నెలలో కేబుల్ బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకొస్తామని, 2023 డిసెంబర్ లోపు మానేరు రివర్ఫ్రంట్పనులు కూడా పూర్తి చేస్తామని మినిస్టర్అన్నారు. క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వొద్దని, యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, నాయకులు హరిశంకర్, కార్పొరేటర్ సంపత్ రెడ్డి, డీఈ మసూద్ అలీ పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలతో కార్మికుల నిరసన
గోదావరిఖని, వెలుగు: వేజ్‌బోర్డు విషయంలో కోల్ ఇండియా యాజమాన్యం వైఖరికి వ్యతిరేకంగా బుధవారం బీఎంఎస్ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ కార్మిక సంఘ్ ఆధ్వర్యంలో సింగరేణి జీడీకే 2ఏ గనిపై నల్ల బ్యాడ్జీలతో కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ స్టేట్ ప్రెసిడెంట్ యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ కోల్ ఇండియా అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 9న బొగ్గు గనులపై, జీఎం ఆఫీస్ ముందు జరిగే మహాధర్నాలో కార్మికులు భారీగా పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఏరియా వైస్ ప్రెసిడెంట్ హరిణ్, వై.సారంగపాణి, లక్ష్మయ్య, సాంబయ్య, వజ్రవేణు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలి: సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమణ
సిరిసిల్ల టౌన్, వెలుగు: మున్సిపల్ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వీడాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు. బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్ ముందు కార్మికులతో నిరసన వ్యక్తం చేసి కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 128 మున్సిపాలిటీలలో ఏళ్ల తరబడి వేల మంది కార్మికులు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారన్నారు. వెంటనే వారిని పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు శంకర్, నర్సయ్య, విజయ, సంతోష్, కార్మికులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
గన్నేరువరం, వెలుగు: సీఎం కేసీఆర్ జగిత్యాల జిల్లా పర్యటన సందర్భంగా కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్లీడర్లు గన్నేరువరం మండలంలోని గుండ్లపల్లి స్టేజీ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధికార ప్రతినిధి మల్లేశం మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ అరెస్ట్ లు, నిర్బంధాలు నిత్యకృత్యంగా మారాయని, పోలీస్ వ్యవస్థ పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తుందన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీశ్ రెడ్డి, బొల్లి శంకరయ్య, మాచర్ల శంకర్, ఎర్రల రాజయ్య, భీంరెడ్డి వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచాలి:పెద్దపల్లి కలెక్టర్ సంగీత
జ్యోతినగర్,వెలుగు: ఉపాధ్యాయులు విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచాలని పెద్దపల్లి కలెక్టర్ డాక్టర్ సంగీత అన్నారు. బుధవారం ఎన్టీపీసీ టీటీఎస్ జెడ్పీ హైస్కూలో రాష్ట్రీయ బాల వైజ్ఙానిక ప్రదర్శన, ఇన్ స్పైర్ అవార్డ్ జిల్లా స్థాయి ప్రదర్శన, ప్రాజెక్ట్ కాంపిటీషన్ ముగింపు కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. సంచార ప్రయోగశాలను విద్యార్థులు వినియోగించుకొని శాస్ర్తవేతలుగా ఎదగాలన్నారు. ప్రతి విద్యార్థుల్లో ఏదో ఒక మంచి టాలెంట్ ఉంటుందని, దాన్ని వెలికి తీసి అందరికి ఆదర్శంగా నిలవాలన్నారు. అనంతరం ప్రదర్శనలు తిలకించిన కలెక్టర్ విద్యార్థులను అభినంధించారు. డీఈఓ మాధవి మాట్లాడుతూ కార్యక్రమంలో 402 ప్రదర్శనలు, 57 ఇన్ స్పైర్ ఎగ్జిబిట్స్ జరిగాయన్నారు. కార్యక్రమంలో ఎన్ఐఎఫ్ పరిశీలకులు బెనర్జీ, ఎంఈఓ లక్ష్మి, జిల్లా సైన్స్ అధికారి రవినందన్ రావు, ప్రిన్సిపాల్ శ్రీధర్ తదితరులు ఉన్నారు.
మాజీ మేయర్ ఇంటికి సీఎస్
కరీంనగర్ టౌన్, వెలుగు: సీఎం జగిత్యాల పర్యటనలో భాగంగా కరీంనగర్ వచ్చిన సీఎస్ సోమేశ్ కుమార్ బుధవారం మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఇంటికి వచ్చారు. రవీందర్ కుమార్తె పూజా కౌర్ వివాహం గురువారం అలుగునూర్ లో జరగనుండగా సీఎస్ వధువును ఆశీర్వదించారు. ఆయన వెంట కలెక్టర్ కర్ణన్, అధికారులు ఉన్నారు.
సిరిసిల్ల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి: కరీంనగర్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
సిరిసిల్ల టౌన్, వెలుగు: ఇటీవల సిద్దిపేట జిల్లాలో నిర్వహించిన ప్రదర్శనల కంటే సిరిసిల్లలో నిర్వహించిన సైన్స్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయని కరీంనగర్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. బుధవారం సిరిసిల్లలోని గీతానగర్ జడ్పీ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 50వ జిల్లాస్థాయి సైన్స్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంట్ ప్రదర్శనకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అనంతరం రాష్ట్రస్థాయి సైన్స్ ప్రదర్శనలు చేసిన స్టూడెంటలకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో డీఈఓ రాధాకిషన్, జిల్లా సైన్స్ అధికారి ఆంజనేయులు, హెడ్మాస్టర్భాగ్యరేఖ, టీచర్లు పాల్గొన్నారు.