ఎలక్షన్స్ కోసం కాదు.. నెక్ట్స్ జనరేషన్ కోసం ఆలోచిస్తున్నా : గంగుల కమలాకర్

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సేఫ్ సిటీ అని, ఇక్కడ శాంతిభద్రతలు బాగున్నందువల్లే ఐటీ టవర్, ఇతర పరిశ్రమలు వచ్చాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కులం, మతం పేరిట కొట్లాటలు పెట్టుకుంటే ఐటీ కంపెనీలు, పరిశ్రమలు రావని పేర్కొన్నారు. తాను ఆలోచించేది, కష్టపడేది నెక్ట్స్  ఎలక్షన్స్ కోసం కాదని.. నెక్ట్స్ జనరేషన్ కోసమని మంత్రి స్పష్టం చేశారు. కరీంనగర్ సిటీలో మేయర్ యాదగిరి సునీల్ రావుతో కలిసి గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు రూ.133 కోట్ల సీఎంఏ గ్రాంట్స్ తో చేపట్టిన పనులకు శంకుస్థాపన చేశారు.

కోతిరాంపూర్ మండలం స్వామి దేవాలయం మైదానంలో వాకింగ్ ట్రాక్ లైటింగ్ సిస్టం, ఎస్ ఆర్ ఆర్ కాలేజీ, ఎంల్ఎండీ కట్ట కింద వాకింగ్ ట్రాక్, లైటింగ్ సిస్టం,  శాతవాహన యూనివర్సిటీ వద్ద నైట్ ఫుడ్ బజార్ ప్రారంభించారు. 33వ డివిజన్ లో బతుకమ్మ చీరలను పంపిణీ  చేశారు. 12వ డివిజన్ లో నిర్వహించిన సభలో మంత్రి గంగుల మాట్లాడుతూ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా ప్రజల మధ్యే ఉన్నానన్నారు. నా మీద పోటీ చేసినోళ్లు  మళ్లీ ఎలక్షన్లప్పుడు మాత్రమే కనిపిస్తున్నారని ఆరోపించారు.  

కరీంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తూనే.. ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇస్కాన్  టెంపుల్ నిర్మాణం సందర్భంగా 7న నిర్వహించే ర్యాలీ కోసం హరే రామ హరే కృష్ణ, ఇస్కాన్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. లైబ్రరీ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, హరేరామ హరేకృష్ణ ప్రతినిధులు నరహరి స్వామి, మధుసూదన్ రెడ్డి ,రాజేందర్ రెడ్డి, నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రాజ భాస్కర్ రెడ్డి, రమేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి  పాల్గొన్నారు.