ఆరోగ్య రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది: మంత్రి గంగుల

దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇవాళ కరీంనగర్ లో కంటి వెలుగు 2వ విడత కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన మంత్రి.. ఆరోగ్య రంగంలో రాష్ట్రం దూసుకుపోతుందని తెలిపారు. పేదవాడికి అవసరమైన ప్రతీ పథకం రూపొందించిన సీఎం కేసీఆర్ కు అందరూ దీవెనలు అందివాలన్నారు. దవాఖాన్ల చుట్టూ తిరిగే అవసరం లేకుండా ఆసుపత్రి సిబ్బందే మీ దగ్గరికి వస్తున్నారని వెల్లడించారు. 13 రోజుల పాటు నిర్వహించే ఈ కంటి వెలుగు శిబిరంలో కేవలం మీ ఆధార్ కార్డుతో పేరు నమోదు చేసుకుంటే పరీక్షలు నిర్వహిస్తారని సూచించారు.

ఈ శిబిరంలో కంటి సమస్యలతో పాటు.. కళ్లు మసకగా కనిపించినా కూడా మందులను అందజేస్తారని మంత్రి గంగుల అన్నారు. సీఎం కేసీఆర్ ప్రజలందరి ఆరోగ్యం కోసం ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని, వయసు మీదపడ్డిన వారి కంటి చూపును కాపాడడానికి ఆయన కృషి చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగును కేసీఆర్ ప్రారంభించారన్నారు. అలాగే కేంద్రం సహాయం లేకున్నా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలని బస్తీ దవాఖానాలు, మెడికల్ కాలేజీలతో పాటు వేల కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రులను నిర్మిస్తున్నారని మంత్రి తెలిపారు. ఇక మొదటి విడత కంటి వెలుగులో కేవలం కరీంనగర్ పట్టణంలోనే ఐదున్నర లక్షల మందికి పరీక్షలు నిర్వహించామని గంగుల పేర్కొన్నారు.