ధరణిలో ఎక్కని భూములన్నీ సర్కార్​ కే..

ధరణిలో ఎక్కని భూములన్నీ సర్కార్​ కే..
  •     పోర్టల్​లో ఆస్తులు నమోదై లాక్​ అయితే ఎవ్వరేం చేయలేరు
  •     నిర్బంధంగా ప్రజల ఆస్తుల వివరాలు నమోదు చేయాలి
  •    డేటా ఎంట్రీలో తప్పులు వస్తే ఆఫీసర్లదే బాధ్యత: మంత్రి గంగుల కమలాకర్​

కరీంనగర్, వెలుగు:   ధరణి పోర్టల్​లో ఎక్కని భూములన్నీ మిగులు భూముల కిందే లెక్క అని, వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. పోర్టల్​లో ఒక్కసారి ఆస్తులు నమోదై లాక్  అయితే ఎవ్వరేం చేయలేరని చెప్పారు. నిర్బంధంగా ప్రజల ఇళ్ల స్థలాలు, సాగు భూముల వివరాలను ధరణిలో నమోదు చేయాలని ఆఫీసర్లను ఆదేశించారు. ఆస్తుల డేటా ఎంట్రీలో తప్పులు వస్తే ఆఫీసర్లదే బాధ్యత అని హెచ్చరించారు.  ఆస్తుల సర్వేపై గురువారం కరీంనగర్​లో మంత్రి సమీక్షించారు. పిల్లలు  చదవకపోతే నిర్బంధంగా ఎట్లా చదివిస్తమో అట్లనే  ఇంటి భూమిని కానీ, వ్యవసాయ భూమిని కానీ ధరణి పోర్టల్​లో ఎక్కించాలన్నారు.

‘‘దసరా పండుగను పురస్కరించుకొని ధరణి పోర్టల్ ప్రారంభం అవుతది. ధరణిలో ఒక్కసారి ఆస్తులు నమోదై లాక్  అయితే ఎవ్వరేం చేయలేరు. ధరణిలో ఎక్కకుంటే  మిగులు భూమి కిందే లెక్క. మిగులు భూమిని ప్రభుత్వం ఆక్యుపై చేసుకుంటది. అప్పుడు మనమేం చేయలేం. దీనికి ప్రత్యక్షంగా.. పరోక్షంగా మనమే బాధ్యులమవుతం” అని మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యలు లేకుండా చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, రాష్ట్రంలోని మొత్తం భూభాగాన్ని రికార్డు చేసేలా ధరణి పోర్టల్ రూపుదిద్దుకుంటున్నదని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల 77 లక్షల ఎకరాల భూమి ఉందని, ఇదంతా ధరణి పోర్టల్ లో రికార్డు కావాల్సిందేనని.. వ్యవసాయ, వ్యవసాయేతర భూములు అన్నీ నమోదు చేస్తామని, ఒక్కసారి నమోదు చేసిన తర్వాత పేరు మార్పిడికి తప్ప ఇతర అంశాలకు తావు ఉండదని స్పష్టం చేశారు.  రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ ఫ్రీగా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చెప్పారు. రైతుల మేలు కోరి ప్రయత్నం చేస్తున్నప్పుడు వారి ఆస్తులను నమోదు చేయించుకునే కనీస బాధ్యత తీసుకోవాలని ఆఫీసర్లకు సూచించారు.