
విశాఖ స్టీల్ ప్లాంట్ కు బిడ్ వేసే విషయంపై.. తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రతినిధుల బృందం విశాఖ స్టీల్ ప్లాంట్ సందర్శించటంపై ఏపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ స్పందించారు. ఏప్రిల్ 10వ తేదీ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారాయన. తెలంగాణ ప్రభుత్వం ఇంకా బిడ్‌లో పాల్గొనలేదని.. ఒక బృందాన్ని పంపించి, ప్లాంట్ నిర్వహణ సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామని మాత్రమే చెప్పారన్నారు. అయితే ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమా? కాదా?.. ఒకవేళ ప్రైవేటీకరణకు అనుకూలం అనుకుంటే, ఇలా ప్రైవేటీకరణ చేస్తున్న ప్రతి చోటా తామూ బిడ్‌లో పాల్గొంటామని చెబుతారా అంటూ సీఎం కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మంత్రి అమర్ నాథ్. ఒకవేళ అలాంటి ఉద్దేశం, ఆలోచన లేనప్పుడు, ఏ విధంగా ఇప్పుడు బిడ్‌లో పాల్గొంటారని నిలదీశారు. నిజానికి ప్రైవేటీకరణ వద్దని మొన్న వారే చెప్పారు... ఇప్పుడు బిడ్‌లో పాల్గొంటున్నారంటే.. ప్రైవేటీకరణకు వారు అనుకూలంగా ఉన్నట్లే కదా అంటూ కౌంటర్ చేశారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తే.. కేంద్రానికి లేఖ రాయొచ్చు కదా? సంస్థకు క్యాపిటివ్ మైన్స్ ఇవ్వమని కోరవచ్చు కదా అంటూ కేసీఆర్ కు సూచించారు మంత్రి అమర్ నాథ్.
బిడ్ వేసే అర్హతే తెలంగాణ ప్రభుత్వానికి లేదు
ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించి.. కేంద్ర ఆర్థిక శాఖ 2022, ఏప్రిల్ 19న మెమో ద్వారా నియమావళి ప్రకటించిందని.. 51 శాతం, అంతకంటే ఎక్కువ వాటా కలిగి ఉన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ లేదా రాష్ట్ర ప్రభుత్వ సంస్థ లేదా సంయుక్త భాగస్వామ్య సంస్థ లేదా మరే ఇతర ప్రభుత్వరంగ సంస్థల(పీఎస్ యూ)లు ప్రైవేటీకరణ బిడ్లలో పాల్గొనరాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పిన విషయాన్ని బయటపెట్టారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు తెలియకుండా ఉంటుందా అని ప్రశ్నించారు మంత్రి అమర్ నాథ్. - మరి రూల్స్ ఇలా ఉన్నప్పుడు.. రాష్ట్ర ప్రభుత్వాలకు అంత శక్తే ఉండదని తెలిసినప్పుడు.. తెలంగాణ ప్రభుత్వం వచ్చేస్తుందని చెప్పటం ఏమిటని ప్రశ్నించారాయన. - కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా అనుమతి ఇస్తే తప్ప.. బిడ్ లో పాల్గొనే అవకాశమే లేదని తేల్చిపారేశారాయన.
కేంద్రమే నడపలేకపోతుంటే.. కేసీఆర్ నడిపిస్తారా
కేంద్రమే నడపలేని ఒక సంస్థను.. రాష్ట్ర ప్రభుత్వం నడపగులుగుతుందా అని ప్రశ్నించారాయన. అందుకే తెలంగాణకు కూడా అది సాధ్యం కాదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి.. సీఎం జగన్ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయటం ఇష్టం లేదని.. ఈ విషయాన్ని పదేపదే కేంద్రం దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు మంత్రి అమర్ నాథ్. అలాంటప్పుడు కొనడం అనే మాటే ఉత్పన్నం కాదని.. బీజేపీ, బీఆర్‌ఎస్.. రాజకీయాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ డ్రామా ఆడుతున్నారని వివరించారు మంత్రి అమర్ నాథ్.