- అవసరమైతే ప్రత్యేక ఓపీ కౌంటర్లు పెట్టండి
- ప్రైవేట్ హాస్పిటళ్లు జనాన్ని దోచుకుంటే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశం
- పేషంట్లను భయపెడుతూ ప్రైవేటు దవాఖాన్లు దోచుకుంటున్నయ్
- వాటిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్లకు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, మిషన్ భగీరథ స్కీమ్‌ల వల్ల రాష్ట్రంలో పరిశుభ్రత పెరిగిందని, దీంతో గతంలో పోలిస్తే డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు గణనీయంగా తగ్గిపోయాయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రాష్ట్రంలో గతేడాది 7,988 డెంగ్యూ కేసులు నమోదవగా, ఈ ఏడాది ఇప్పటివరకు 5,263 కేసులు వచ్చాయని చెప్పారు. గత పది రోజుల్లో ఫీవర్ కేసులు స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తున్నదని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆయన ఆదేశించారు. హెల్త్ సెక్రటరీ రిజ్వీ, స్టేట్ హెల్త్ ఆఫీసర్లు, అన్ని జిల్లాల డీఎంహెచ్‌వోలు, దవాఖాన్ల సూపరింటెండెంట్లతో మంగళవారం మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జ్వరంతో వచ్చే ప్రతి ఒక్కరికీ డెంగ్యూ, మలేరియా సహా అవసరమైన అన్ని పరీక్షలు చేయాలని, సకాలంలో వారిని అడ్మిట్ చేసుకుని ట్రీట్‌మెంట్ అందించాలని సూచించారు. టెస్టింగ్ కిట్లు, మందులు ప్రతి దవాఖానలో అందుబాటులో ఉండేలా చూసుకోవాలని టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించారు. అవసరమైతే జ్వరాల కోసం ప్రత్యేక ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
ప్రైవేటు హాస్పిటల్స్ దోచుకుంటున్నయ్
కొన్ని ప్రైవేటు హాస్పిటళ్లు డెంగ్యూ చికిత్స పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, ప్లేట్ లెట్స్ ఎక్కించాలంటూ అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ దృష్టికి వచ్చిందని మంత్రి తెలిపారు. ఆరోగ్యం క్షీణించాక చివరి నిమిషంలో ప్రభుత్వ ఆసుపత్రులకు రిఫర్ చేసి బాధ్యత లేకుండా ప్రైవేటు హాస్పిటళ్లు ప్రవర్తిస్తున్నట్లు తెలిసిందన్నారు. అలాంటి హాస్పిటల్స్ పట్ల డీఎంహెచ్‌వోలు కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని వెల్‌నెస్ సెంటర్ల పనితీరు మెరుగు పడాలని మంత్రి హరీశ్ అన్నారు. వెల్‌నెస్ సెంటర్ల సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు, జర్నలిస్టులకు మంచి వైద్య సేవలు అందించాలని సూచించారు.
ఉద్యోగుల కోసం త్వరలో పీఆర్సీ..
సిద్దిపేట, వెలుగు : దేశంలో ఎక్కడా లేనివిధంగా టీచర్లు, ఉద్యోగులకు 71 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్ రావు అన్నారు. త్వరలోనే ఉద్యోగుల కోసం సీఎం కేసీఆర్ కొత్త పీఆర్సీ వేయనున్నారని వెల్లడించారు. సిద్దిపేట టీటీసీ భవన్‌లో మంగళవారం తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేసే దిశగా ఇంగ్లిషు మీడియం క్లాసెస్ ప్రారంభించామని, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య 6 లక్షల దాటిందని, కానీ ప్రభుత్వ ప్రైమరీ, జెడ్పీ స్కూళ్లల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి వల్ల రాలేదని విమర్శించారు. చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా సిద్దిపేటలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. కేసీఆర్ నగర్ లో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో కుమ్మర మోడ్రన్ మెకనైజ్డ్ పాఠరి ఇండస్ట్రీ, -కుమ్మరి కుల వృత్తులకు శిక్షణ కేంద్రానికి హరీశ్ శంకుస్థాపన చేశారు. సిద్దిపేట రైతు బజార్‌లో యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలో రైతులకు డిజిటల్ క్రెడిట్ కార్డులను పంపిణీ చేశారు.