సిద్దిపేట, వెలుగు : జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు మంత్రి హరీశ్ రావు సూచించారు. మంగళవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రెడ్డి సంక్షేమ సంఘంలో జడ్పీ చైర్మన్ రోజాశర్మ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశానికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలసి మంత్రి హాజరయ్యారు. అగ్రికల్చర్, హార్టికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, డెవలప్మెంట్, విద్యుత్ శాఖల అభివృద్ధి పై ఆఫీసర్లు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎరువులు దొరకక లైన్లో నిల్చుని ఏడుగురు రైతులు చనిపోయారని, అలాంటి పరిస్థితి ఇక్కడ రావొద్దన్నారు. గజ్వేల్ లో రేక్ పాయింట్ ఉన్నందున ఎరువుల విషయంలో అధికారులు జాగ్రతలు పాటించాలని సూచించారు. జిల్లాలో వానాకాలంలో 5 లక్షల 27వేలు, యాసంగి లో 2 లక్షల 90 వేల వరి సాగును లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. వచ్చే ఎండకాలంలో వరి పంటకు నీటి కొరత లేకుండా మల్లన్న సాగర్ లో ఉన్న 15 టీఎంసీలు, రంగనాయక సాగర్ లో ఉన్న 3 టీఎంసీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతులు ఆయిల్ పామ్ సాగుకు కృషి చేయాలని, అవసరమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోయి ఫీల్డ్ విజిట్ చేయాలని చెప్పారు. ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరిక మేరకు దుబ్బాక నియోజకవర్గానికి అవసరమైన స్పింక్లర్ సెట్లు అందించాలని డీడీ రామలక్ష్మిని మంత్రి ఆదేశించారు. విద్యాశాఖ కు సంబంధించిన ప్రగతిని డీఈవో శ్రీనివాస్ రెడ్డి తెలియజేసే సమయంలో కోహెడ మండల ఎంపీపీ కొక్కుల కీర్తి అగిడిన ఓ ప్రశ్న కు సమాధానంగా మంత్రి మాట్లాడుతూ రైతులు రోడ్ల పై వడ్లు ఆరబోసి ప్రమాదాలకు కారణం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈజీఎస్ ద్వారా నిర్మించిన కల్లాల డబ్బులు 150 కోట్లు తిరిగి వెనక్కి ఇవ్వాలని కేంద్రం అనడం దారుణమన్నారు.
100 స్కూళ్లను సిద్ధం చేయాలి
జనవరి 2లోపు మనఊరు మనబడిలో భాగంగా పనులు పూర్తయిన 100 స్కూళ్లను ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. గతేడాది టెన్ట్లో జిల్లా ఫస్ట్ ప్లేస్లో నిలిచిందని, ఈ యేడు కూడా అదే స్థానంలో నిలిపేలా కృషి చేయాలన్నారు. దుబ్బాకలో త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానున్న కేసీఆర్ చదివిన గవర్నమెంట్ స్కూల్ కాంపౌండ్ వాల్, డ్రింకింగ్ వాటర్, ఇతర పెండింగ్ వర్క్స్ వెంటనే కంప్లీట్ చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. విద్యాశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని వెల్లడించారు.
ప్రారంభించిన తెల్లారే తాళం వేస్తారా..?
హుస్నాబాద్ లో డయాలసిస్ కేంద్రాన్ని తాను ప్రారంభించిన తెల్లారి నుంచే దానికి తాళం వేయడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. 48గంటలలో సమస్యను పరిష్కరించి ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం తిరిగి ప్రారంభించాలని వైద్యాధికారులను ఆదేశించారు. ఇదిలా ఉండగా సిద్దిపేట జిల్లాగా ఏర్పడిన తర్వాత ఇక్కడికి అన్ని ఆఫీసులు వచ్చాయని, కొద్ది రోజుల్లోనే ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ ల ఎస్ఈ ఆఫీసులు కూడా రానున్నాయని తెలిపారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
ఎంపీపీ లు, జడ్పీటీసీ లు పలు సమస్యలను అధికారులు, మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మద్దురు మండల పరిధిలోని మోడల్ స్కూల్ హాస్టల్ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని, స్టూడెంట్స్ కు బస్సు సౌకర్యం కల్పించాలని మద్దూరు జడ్పీటీసీ గిరి కోండల్ రెడ్డి సభా దృష్టికి తెచ్చారు. దుబ్బాక, రాయపోల్ మండలాల పరిధిలోని ఐదు గ్రామాల్లో కరెంట్ సమస్యలను తీర్చాలని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కోరారు. అంగన్వాడీల్లో సరుకులు సరిగా ఇవ్వడం లేదని పలువురు సభ్యులు ఆరోపించారు.
విద్యుత్ ఆఫీసర్లపై దుబ్బాక ఎమ్మెల్యే ఫైర్
దౌల్తాబాద్ మండల పరిధిలోని శేరుపల్లి బందారం గ్రామంలో రైతులు ఇంటి బిల్లులు కట్టలేదని, వారి వ్యవసాయ బోర్లకు కరెంట్ సరఫరా ఎలా నిలిపేస్తారని విద్యుత్ అధికారులపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంట్ తీసేయడంతో పంటలకు నీరు అందక ఎండిపోయే ప్రమాదముందని తెలిపారు. దీనిపై మంత్రి స్పందిస్తూ వెంటనే సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. దుబ్బాక పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ట్రాన్స్ఫార్మర్లు ప్రమాదకరంగా ఉన్నాయని, వెంటనే వాటిని తొలగించాలని ఎమ్మెల్యే కోరారు.
గైనకాలజిస్ట్ లను కేటాయించాలి..
దుబ్బాక ప్రభుత్వ హాస్పిటల్ కు గైనకాలజిస్ట్ లను కేటాయించాలని ఎమ్మెల్యే రఘునందన్ రావు కోరారు. హెల్త్ డిపార్ట్ మెంట్ ప్రగతిని డీఎంహెచ్ వో కాశీనాథ్ వివరిస్తుండగా దుబ్బాక హాస్పిటల్ లో గైనకాలజిస్టులు ఇద్దరు మాత్రమే ఉన్నారని, వారు సరిగ్గా రావడం లేదని, దీంతో సరైన వైద్యం అందక ఓ మహిళ చనిపోయిందని, రెగ్యులర్ గా సేవలు అందించేలా గైనకాలజిస్ట్ ను నియమించాలన్నారు. దీనికి మంత్రి స్పందిస్తూ గజ్వేల్ హాస్పిటల్ నుంచి ఇద్దరు గైనకాలజిస్ట్ లను దుబ్బాక హాస్పిటల్ కు కేటాయించాలని డీఎంహెచ్ వో కు సూచించారు.