కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లారు : హరీష్ రావు

మునుగోడు : 18 వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీలో చేరారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి నాలుగేళ్లయినా నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఒక్క కొబ్బరికాయ కొడితే వంద పనులు అవుతాయన్న రాజగోపాల్ రెడ్డి..  మరి ఎందుకు పనులు చేయలేదన్నారు. ఉప ఎన్నికలో గెలిస్తే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు గానీ.. ఎవరికి ఏం లాభం ? అని ప్రశ్నించారు. ఒకవ్యక్తి లబ్ధి పొందాలా..? లేక ప్రజలు లబ్ధి పొందాలో ఆలోచించండి అని ఓటర్లను కోరారు. ప్రభాకర్ రెడ్డి గెలుపు..మునుగోడుకు కీలక మలుపు అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ, రాజ్ పేట్ తండాలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. 

ఫ్లోరైడ్ బాధలు పరిష్కరించాం

ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల ఫ్లోరైడ్ బాధలు చూసి, సీఎం కేసీఆర్ పరిష్కరించారని మంత్రి హరీష్ రావు చెప్పారు. గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం ప్రభుత్వాలు ఏనాడైనా ప్రజల నీటి కష్టాలు పరిష్కరించాయా..? అని ప్రశ్నించారు. ‘తెలంగాణ గురించి మాట్లాడే హక్కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కు ఉందా..? ఎమ్మెల్యేగా రాజీనామా చేయమంటే అనాడు కిషన్ రెడ్డి పారిపోయారు. నాపై 300 వరకూ కేసులు ఉన్నాయి. ఉద్యమం సమయంలో చాలాసార్లు అరెస్ట్ అయ్యాం. మీరా తెలంగాణ గురించి మాట్లాడేది..? ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండలాలు ఏపీలో కలిసేలా చేశారు’ అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ రాజీనామా చేసినప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి..కరీంనగర్ ఇల్లంతకుంట ఇన్ చార్జీగా ఉన్నారని, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టినా కలిసే పోరాటం చేశామని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. మునుగోడుకు కేంద్ర మంత్రులు, బీజేపీ నాయకులు ఎందుకు వస్తున్నారని ప్రశ్నించారు. 2003లోనే సీఎం కేసీఆర్ మర్రిగూడలో పల్లె నిద్ర చేశారని చెప్పారు. 

మునుగోడును దత్తత తీసుకుంటాం

ఎనిమిదేళ్లు అయినా కృష్ణా జలాల్లో నీటి వాటా తేల్చలేదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ లో రూ.750, కర్నాటకలో రూ.600 పింఛన్ ఇస్తుంటే.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.3వేల పింఛన్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. బీజేపీ గెలిస్తే వ్యవసాయ బావుల వద్ద మీట్లరు పెడుతారని, ఇంటికి కరెంటు బిల్లులు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతులను ఆగం చేస్తోందన్నారు. రైతుబంధు, రైతు బీమా, కేసీఆర్ కిట్స్, 24 గంటల కరెంట్, తాగునీరు వంటి అనేక పథకాల గురించి చెప్పి ఓట్లు అడుగుతున్నామని అన్నారు.

సీఎం కేసీఆర్ 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారని మంత్రి హరీష్ రావు తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు ఒక్క డబుల్ బెడ్ రూం కూడా ఇల్లు కట్టించలేదని ప్రశ్నించారు. ఉప ఎన్నికలో టీఆర్ఎస్ ను గెలిపిస్తే మునుగోడును మంత్రి కేటీఆర్ దత్తత తీసుకుంటారని హామీ ఇచ్చారని, గెలిపించిన తర్వాత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పారు. బీజేపీ వాళ్లు డబ్బును, తాము ప్రజలను నమ్ముకున్నామని మంత్రి హరీష్ రావు అన్నారు.