
రాష్ట్రంలో ప్రతిపక్షాలు అధ్యక్షులను మార్చినా, ఔట్ డేటెడ్ లీడర్లకు పట్టం కట్టినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో నూతనంగా నిర్మించిన ఫ్రీడమ్ పార్క్, డిసిసిబి బ్యాంక్, అర్ అండ్ బి గెస్ట్ హౌజ్, భవనాలను మంత్రి ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం అడిగింది ఇవ్వకుండా, అసలు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వానికి ధక్షణాది రాష్ట్రాలకు ఏమైనా ఇచ్చిందా అంటే అది కేవలం శుష్కప్రియాలు, శూన్య హస్తాలు మాత్రమేననన్నారు.
ఆల్ రిజెక్ట్డ్ లీడర్లను, స్క్రాబ్ రాజకీయ నేతలను, బీఆర్ఎస్ పక్కకు పెట్టిన వారిని పార్టీలోకి తీసుకుని ప్రతిపక్ష పార్టీలు జబ్బలు చరుచుకోవడం సిగ్గుచేటని హరీష్ రావు విమర్శించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్న హరీష్ .. మళ్లీ గెలిచిన వెంటనే పటాన్ చెరుకు మెట్రో రైలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఐటీ సేవల విస్తరణకు పటాన్ చెరు కేంద్రం కాబోతుందన్నారు.