గవర్నర్ కక్షతోనే అభివృద్ధిని అడ్డుకుంటున్నరు: హరీశ్

గవర్నర్ తమిళి సై పై మంత్రి హరీశ్ రావు విమర్శలు చేశారు. గజ్వేల్ కు రావాల్సిన ఫారెస్ట్ యూనివర్శిటీ  బిల్లును గవర్నర్ అడ్డుకున్నారని  ఆరోపించారు. గవర్నర్ కక్ష పూరితంగా వ్యవహరిస్తూ   రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతోందన్నారు. బీఆర్ఎస్  గజ్వేల్ నియోజకవర్గ ప్రతినిధుల సభకు ముఖ్యఅతిథిగా హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా  మాట్లాడిన ఆయన..  అసెంబ్లీ తీర్మానం చేసిన బిల్లులను గవర్నర్ తొక్కి పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. గవర్నర్ వ్యవస్థను అడ్డుపెట్టుకుని బీజేపీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు.  
 
ఒక గులాబీ సైనికుడిగా ఉద్యమకారుడుగా తనకు మాట్లాడే  హక్కు ఉందన్నారు హరీశ్. ఎక్కడైనా అభివృద్ధి అంటే దేశానికి సంపద రావాలి బయట దేశాల్లో ఉన్నవారు తిరిగి మన దేశానికి రావాలి కానీ.. ఇక్కడ రివర్స్ లో జరుగుతోందన్నారు.  కేంద్రంలో ఉన్న  బీజేపీ  పోకడ వల్ల దేశంలో ఉన్న సంపద బయట దేశాలకు తరలి పోతోందని... దేశంలోని పౌరులు బయట దేశాలకు వెళ్ళిపోతున్నారని విమర్శించారు.

చరిత్ర తిరగరాసిన నాయకుడు కేసీఆర్ అని..  గజ్వేల్ లో  జరుగుతున్న అభివృద్ధి చూడటానికి దేశ విదేశాల నుండి పక్క రాష్ట్రాల నుంచి వస్తున్నారని  హరీశ్ రావు అన్నారు. కేసీఆర్  ఎంత బిజీగా ఉన్నా  గజ్వేల్ ప్రాంత పైన ఉన్న అభిమానం ప్రేమ ప్రత్యేకమైందని చెప్పారు.  రెండు సార్లు  గెలిపించిన గజ్వేల్ ప్రజల రుణం తీర్చుకునేందుకే గజ్వేల్ ఇంతటి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారని తెలిపారు.