నిర్మలమ్మే ఒప్పుకుంది.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తరు : హరీష్ రావు

మోటార్లకు మీటర్లు పెట్టకపోవడం వల్లే రాష్ట్రానికి నిధులు ఇవ్వలేదని స్వయంగా కేంద్ర అర్థిక  మంత్రి నిర్మలా సీతారామన్  ఒప్పుకున్నారని మంత్రి హరీష్​ రావు అన్నారు. ఈ విషయంలో తెలంగాణ బీజేపీ నాయకులు గతంలో అసత్యాలు మాట్లాడారని..ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. 

మోటార్లకు మీటర్లు పెట్టనందుకే తెలంగాణకు రావాల్సిన  రూ. 25వేల కోట్లను కేంద్రం  ఆపిందని హరీష్​ రావు అన్నారు. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో మీటర్లు పెడుతున్నారని వారికి నిధులు ఇచ్చిమని కేంద్ర మంత్రి చెప్పారని హరీష్ రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓట్లు వేస్తే మోటార్లకు మీటర్లు తప్పవని హెచ్చరించారు.  కాంగ్రెస్, బీజేపీలు రైతు వ్యతిరేక పార్టీలని అన్నారు.

కేంద్రం నిధులు రాకపోయినా పర్వాలేదని.. రైతుల ప్రయోజనాల కోసం కేసీఆర్ రైతుపక్షాన నిలబడ్డారని అన్నారు. దేశంలో రైతుపక్షపాతి ఒకే ఒక్కరు కేసీఆర్.. ఆయన పాలనలో రైతులు సురక్షితంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. 

జీడీపీలో కేంద్రం అప్పులు 57 శాతమని.. తెలంగాణ అప్పులు 28 శాతమేనని హరీష్​ రావు చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు బీజేపీ కారణం కాదా అని నిలదీశారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించి కార్మికులను ఆగం చేసింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలంటూ కేంద్రం నిరుద్యోగులను మోసం చేసిందని.. ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని హరీష్ రావు తెలిపారు.