అవతరణ వేడుకలు గ్రాండ్‌గా చేయాలి
రాష్ట్ర దశాబ్ది వేడుకల నిర్వహణపై సమీక్షలో మంత్రి హరీశ్
21 రోజుల కార్యాచరణపై ప్లాన్ రెడీ చేయాలని ఆదేశం
హైదరాబాద్,వెలుగు : రాష్ట్ర అవతరణ వేడుకల నిర్వహణకు ప్లాన్ రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. తొమ్మిదేండ్లలో సంక్షేమ, అభివృద్ధి పథకాలను చేపట్టి రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని గుర్తుచేశారు. జూన్ 2 నుంచి ప్రారంభమయ్యే 21 రోజుల దశాబ్ది ఉత్సవాల్లో చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసేందుకు సెక్రటేరియెట్‌లో శుక్రవారం జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఉత్సవాల్లో ప్రజలను భాగస్వామ్యం చేయాలని, ఘనంగా నిర్వహించాలని సూచించారు.
జూన్ 2న హైదరాబాద్‌లో నిర్వహించే ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని, జిల్లా కేంద్రాలలో జరిగే ప్రారంభోత్సవాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ఉత్సవాలకు సంబంధించి రూపొందించే డాక్యుమెంటరీ చిత్రాల వివరాలను సీఎస్ శాంతి కుమారి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలు సాధించిన విజయాలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమాల కార్యాచరణ ప్లాన్‌ను వెంటనే సమర్పించాలన్నారు. మంత్రుల ప్రతిపాదనలు, సూచనలపై సమావేశంలో చర్చించి తదుపరి సూచనల కోసం సీఎంకు పంపనున్నారు. ఈ సమావేశంలో మంత్రులు మహమూద్ అలీ, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సీహెచ్ మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎస్ నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.