హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పచ్చి అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఆయనకు నిజాలు పలికితే తల వెయ్యి ముక్కలయ్యేలా ఏదైనా శాపం ఉందేమోనని మంగళవారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ‘మాయ మాటల అమిత్ షా.. అబద్ధాల బాద్ షా’ అని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వలేదనడం పచ్చి అబద్ధమని స్పష్టం చేశారు.
2016 సెప్టెంబర్ లో ములుగు మండలంలో రెండు ప్రాంతాల్లో భూములను గుర్తించి కేంద్రానికి లెటర్ రాశామన్నారు. కేంద్ర బృందం 2017 ఫిబ్రవరి 13న వచ్చి ములుగులో భూములు అనుకూలంగా ఉన్నాయని నివేదిక ఇచ్చిందని తెలిపారు. కానీ కేంద్ర కేబినెట్ దాన్ని పెండింగ్లో పెట్టిందని గుర్తుచేశారు. కృష్ణా జలాల్లో వాటా కోసం తెలంగాణ కృషి చేయలేదనడం అమిత్ షా అబద్ధాలకు పరాకాష్ట అని విమర్శించారు.
దీనిపై కేంద్రం మౌనంగా ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. కేంద్రం హామీ మేరకు 2021 జూన్లో ప్రభుత్వం తన పిటిషన్‌ను వాపస్ తీసుకుందని వివరించారు.