కాంగ్రెస్​ది అబద్ధాల డిక్లరేషన్​.. మోసపోతే గోసవడ్తం : హరీశ్​రావు

సంగారెడ్డి, వెలుగు :  కాంగ్రెస్ నేతలు వారి 60 ఏండ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి చేయకుండా.. ఇప్పుడు మళ్లీ చాన్స్​ ఇస్తే రాష్ట్రాన్ని డెవలప్​ చేస్తామని అబద్ధాల డిక్లరేషన్​తో వస్తున్నారని మంత్రి హరీశ్​​రావు విమర్శించారు. అధికార దాహంతో ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసపూరిత వాగ్దానాలతో తెలంగాణ బిడ్డలను గోసవెట్టే పనిలో కాంగ్రెస్​ నేతలు ఉన్నారని మండిపడ్డారు. శనివారం సంగారెడ్డి జిల్లా కంది, మల్కాపూర్, సంగారెడ్డి, అందోల్​లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​ నాయకుల మాయమాటలు నమ్మొద్దన్నారు. సీఎం కేసీఆర్​ రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం కోసం పాటుపడుతూ రాష్ట్రాన్ని దేశానికే రోల్​ మోడల్​గా తయారుచేశారన్నారు.  కాంగ్రెస్, బీజేపీ నేతలకు అధికార దాహం తప్ప ప్రజా సంక్షేమం పట్టదన్నారు. ఆ రెండు పార్టీలు ఒకే ఎజెండాతో ఎన్నికలకు సిద్ధమవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. కేసీఆర్​ పాలనలో దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేరోజు 9 మెడికల్​ కాలేజీలను ప్రాంభించి వైద్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చామన్నారు. 

ALSO READ: సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్​లో సీపీఐ సభ

ఇస్నాపూర్​కు మెట్రో రావాలంటే.. కేసీఆర్​ మళ్లీ సీఎం కావాలె

పటాన్​చెరు సమీపంలోని ఇస్నాపూర్​ ప్రాంతానికి మెట్రో రైలు రావాలంటే కేసీఆర్​ మూడో సారి సీఎం కావాల్సిందేనని మంత్రి హరీశ్​రావు అన్నారు. మెట్రో రైల్​ లైన్​ వేయించడం కేవలం కేసీఆర్​తోనే సాధ్యమవుతుందన్నారు. పటాన్​చెరు మినీ ఇండియాగా పేరు గాంచి అన్ని రాష్ట్రాలు, అన్ని వర్గాల సంస్కృతి, సంప్రదాయాలతో ఇస్నాపూర్​ అభివృద్ధి చెందిందన్నారు. ఈ ప్రాంతానికి మెట్రో సేవలు ఎంతో అవసరమని, త్వరలోనే సాధించుకుంటామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా సీఎం కేసీఆర్​ పని చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్​ పార్టీని ఆదరించి మూడోసారి అధికారంలోకి తీసుకురావాలని మంత్రి హరీశ్​రావు కోరారు. ఈ కార్యక్రమాల్లో పటాన్​చెరు, ఆందోల్, నారాయణఖేడ్​​ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్​రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్​రెడ్డి, ఎమ్మెల్సీ సత్యనారాయణ, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్, సంగారెడ్డి మాజీ  ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, కలెక్టర్​ శరత్, అడిషనల్​ కలెక్టర్​ చంద్రశేఖర్​  పాల్గొన్నారు.