కాంగ్రెస్ పార్టీపై మంత్రి హరీష్రావు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై కాంగ్రెస్ పార్టీకి కనికరం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ ఇస్తున్న రైతుబంధుతో రైతులు సంతోషంగా ఉన్నారని, 69 లక్షల మందికి రైతు బంధు అందుతోందని చెప్పారు. రైతుల పట్ల కాంగ్రెస్పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. సకాలంలో రైతుబంధు అందొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందన్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూస్తుంటే ప్రభుత్వ పథకాలు ఆపాలని అంటారేమో అని సెటైర్లు వేశారు మంత్రి హరీష్రావు.
రైతుల జోలికి వస్తే ఖబర్దార్అంటూ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో 69 లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ మాదిరిగా తాము ఎన్నికల్లో ఓట్ల కోసం హామీలు ఇచ్చి విస్మరించమన్నారు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా రైతుబంధు పథకం అమలు చేశామన్నారు. రైతుబంధు డబ్బులు ఎలా ఇస్తారంటూ ఎన్నికల కమిషన్కు కాంగ్రెస్ పార్టీ ఎలా ఫిర్యాదు చేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటేనే రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పారు. రాష్ట్రంలో రైతులు కాంగ్రెస్ కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు.
కర్నాటకలో 5 గంటల కరెంటు కూడా సరిగా రావడం లేదన్నారు మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి 3 గంటల కరెంటే చాలు అంటున్నారని చెప్పారు. తెలంగాణ రైతులకు 24 గంటల పాటు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామన్నారు. వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే పంజాబ్ ను దాటి తెలంగాణ ముందంజలో ఉందని, ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి అని చెప్పారు. కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చి.. రైతులను కేసీఆర్ ఆదుకున్నారని తెలిపారు. పొరపాటున తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 3 గంటల పాటే కరెంటు ఇచ్చే ప్రమాదం ఉందన్నారు.
రైతుబంధు దండగ అని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి11 సార్లు అవకాశం ఇచ్చినా రైతులకు నయాపైసా ఇవ్వలేదన్నారు. రైతులపై ఏ మాత్రం ప్రేమ ఉంటే ఎన్నికల కమిషన్కు ఇచ్చిన లేఖను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే తెలంగాణ రైతులకు క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్పార్టీ వాళ్లు ఏం చేసినా అధికారంలోకి రారని చెప్పారు.