వైద్యం కోసం అప్పుడు మహారాష్ట్ర పోతే ఇప్పుడు తెలంగాణకు వస్తున్రు : హరీష్ రావు

సంక్షేమ పథకాల్లో తెలంగాణ ముందుందని మంత్రి హరీష్ రావు అన్నారు. గతంలో వైద్యం కోసం మహారాష్ట్రకు వెళ్తే ఇప్పుడు... మహారాష్ట్ర నుండే తెలంగాణకు వస్తున్నారని చెప్పారు. కొమురంభీం జిల్లా కాగజ్నగర్లో రూ. 5 కోట్లతో నిర్మించిన 30 పడకల ఆసుపత్రిని మంత్రి ప్రారంభించారు. ఆసుపత్రి బలోపేతానికి వైద్యుల పోస్టులు భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి గర్భిణులకు ఆయన  న్యూట్రిషన్ కిట్లు పంపిణీ  చేశారు.

ఇక్కడ  ఎమ్మెల్యే కోనప్ప నిత్యాన్నదానం చేయడం అభినందనీయమన్న మంత్రి.. ఆయనను చూసే తాను కూడా సిద్దిపేటలో ప్రారంభించానని తెలిపారు. గర్భిణీల కోసం కోనప్ప పల్లిపట్టి కిట్స్ ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణలో డయాలిసిస్ సెంటర్లను 102కు పెంచామన్న హరీష్... వారం రోజుల్లో కాగజ్నగర్లో 9 డయాలసిస్ కేంద్రాలను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ANM సబ్ సెంటర్లను పల్లె ఆసుపత్రులుగా మారుస్తున్నామన్న హరీష్.. కరోనా మళ్లీ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేశారు. 

ఇక బెల్లంపల్లిలో వంద పడకల నూతన ఆసుపత్రిని, డయాలసిస్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, ఇంద్ర కరణ్ రెడ్డి, ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, ఎమ్మెల్సీ దండె విఠల్ పాల్గొన్నారు.