నిమ్స్లో ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. నిమ్స్ ఆస్పత్రిలో ప్రకృతి వైద్య విభాగం అందుబాటులోకి వచ్చింది. యోగ, ప్రకృతి వైద్యం అందించాలనే ఉద్దేశంతో యోగాసనాలతో పాటు 159 రకాల థెరపిలను ఆయుష్ ఇంటిగ్రేటెడ్ వెల్ నెస్ సెంటర్ ద్వారా వైద్య సేవలు అందిస్తారని మంత్రి హరీష్ రావు తెలిపారు. ఏడు రకాల యోగాసనాలతో చికిత్స అందించేందుకు ప్రత్యేక గది కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 159 రకాల సేవలు ఆయుష్ విభాగంలో ఉండనున్నాయి. 

 

మొదటి సారిగా నిమ్స్ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆయుష్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభించామన్నారు మంత్రి హరీష్ రావు. తెలంగాణ రాష్ట్రంలో మూడు 50 పడకల ఆయుష్ ఆస్పత్రిలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు. తొమ్మిది ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయని, ఇప్పటికే అడ్మిషన్ లు కూడా ప్రారంభం అయ్యాయని చెప్పారు. మొదటి దశ అడ్మిషన్స్ పూర్తి అయ్యాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 మాత్రమే ఉండేవన్నారు. ఆయుష్ సేవలను ఐఏఎస్, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.