భారీ వర్షంతో రాష్ట్రం అతలాకుతలం అయింది. ఈదురు గాలులు, కుండపోత వర్షం బీభత్సం సృష్టించింది. వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంటలు నాశనం అయ్యాయని ఆందోళనలకు గురవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. చేతికొచ్చే సమయంలో నీళ్లపాలవుతుండంపై అన్నదాతలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో అకాల వర్షం వల్ల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వేల ఎకరాల్లో పంట నష్టపోయింది. పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను మంత్రి హరీష్ రావు పరిశీలించారు. నాంచారుపల్లి, బక్రిచెప్యాల, పొన్నాల, ఏన్సాన్ పల్లి, తడ్కపల్లి, వెంకటాపూర్, బుస్సాపూర్, ఇర్కోడ్, తొర్నాల, దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని తిమ్మాపూర్, పెద్దగుండవెళ్లి, దుంపలపల్లి, దుబ్బాకలో వడగండ్ల వాన పడింది. ఈ ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో పాటు..ఇతర ఉన్నతాధికారులతో కలిసి దెబ్బతిన్న వరి పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పంట నష్టపోయిన రైతులు అధైర్య పడొద్దని.. మంత్రి హరీష్ రావు ధైర్యం చెప్పారు. వర్షాభావంతో నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి.. నష్టపరిహారం అందేలా చూస్తామని చెప్పారు. నష్టపోయిన ధాన్యం పంటల వివరాలు యుద్ధప్రాతిపదికన సేకరించాలని మంత్రి హరీశ్ రావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.