- సమన్వయ సమావేశాల్లోనూ కుదరని సయోధ్య
- సర్దుబాటు చేయలేక ఇంచార్జిలకు తలనొప్పులు
- వైరా ఎమ్మెల్యే వ్యవహారంపై హరీశ్ రావు సీరియస్
- హైదరాబాద్‌కు కార్ల ర్యాలీ రద్దు చేసుకున్న రాములునాయక్
- ఒకరిద్దరి తీరుపై అధిష్టానానికి చేరిన కంప్లైంట్లు
ఖమ్మం, వెలుగు: ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్‌లో అంతర్గత కుమ్ములాటలకు బ్రేక్ పడడం లేదు. వైరా, ఇల్లందు, పాలేరు, మధిర, భద్రాచలం నియోజకవర్గాల్లో ఇప్పటికీ ముఖ్య నేతల మధ్య సఖ్యత కుదరడం లేదు. వచ్చే ఎన్నికల కోసం ముందస్తుగానే అభ్యర్థులను ప్రకటించినా, లీడర్ల మధ్య ఐక్యత లేకపోవడం కార్యకర్తలను టెన్షన్ పెడుతోంది. ఉమ్మడి జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు పార్టీ అధినేత కేసీఆర్ ఎన్నికల ఇంచార్జిలను నియమించి వారాలు గడుస్తున్నా ఇప్పటి వరకు కొన్ని సెగ్మెంట్‌లకు ఆయా ఇంచార్జిలకు ముఖం చూపించ లేదు.
మరి కొన్ని చోట్ల ఇంచార్జిల ఆధ్వర్యంలో లీడర్ల మధ్య విభేదాలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేస్తున్న సమన్వయ సమావేశాల్లోనూ సయోధ్య కుదరడం లేదు. ఇక ఇప్పటికే విభేదాలు రచ్చకెక్కిన చోట ఆయా లీడర్లను సర్దుబాటు చేసేందుకు స్వయంగా ట్రబుల్ షూటర్లు రంగంలోకి దిగాల్సి వస్తోంది. అంతర్గత విషయాలపై రచ్చకెక్కడం ఎంటని మందలించారని తెలుస్తోంది.
రంగంలోకి దిగిన హరీశ్ రావు
వైరాలో నాలుగు రోజుల క్రితం మంత్రి అజయ్ కుమార్ పై ఎమ్మెల్యే రాములు నాయక్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమయ్యాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ వ్యవహారాలను చూస్తున్న మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగినట్టు సమాచారం. పార్టీ లైన్ ప్రకారం వ్యవహరించకుండా, బహిరంగ కామెంట్లు చేయడంపై కొంత సీరియస్ గానే స్పందించినట్టు తెలుస్తోంది. దీంతో అప్పటికే భారీ కార్ల ర్యాలీగా హైదరాబాద్ వెళ్లాలని భావించిన ఎమ్మెల్యే రాములు నాయక్, ఆ ఆలోచనను విరమించుకున్నట్టు సమాచారం. నాలుగు రోజుల్లో తానే ఖమ్మం వస్తానని, అప్పుడు మాట్లాడదామంటూ రాములునాయక్ కు హరీశ్ రావు చెప్పినట్టు పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.
దళితబంధు లబ్దిదారుల ఎంపికలో రాములు నాయక్ ఇచ్చిన లిస్ట్ ను పక్కనపెట్టి, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి మదన్ లాల్ ఇచ్చిన జాబితాలోని లబ్దిదారులను ఫైనల్ చేయడం ఈ మొత్తం గొడవకు కారణమైంది. రాములు నాయక్ ఇచ్చిన లిస్ట్ ను ఇంచార్జి మంత్రి పువ్వాడ అజయ్ అప్రూవ్ చేయాల్సి ఉంది. లేకపోతే ఆ లిస్టులో ఉన్న వారికి స్కీమ్ అందే చాన్స్ లేనట్టే తెలుస్తోంది.
ఇల్లందు బీఆర్‌ఎస్ లో విభేదాలు
ఇక ఇల్లందు బీఆర్ఎస్ లోనూ ముఖ్యనేతల మధ్య విభేదాలు కంటిన్యూ అవుతున్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ, మున్సిపల్ ఛైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు(డీవీ) మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నాలు ఫలించ లేదు. ఆదివారం రాత్రి ఇల్లందు నియోజకవర్గ ముఖ్య నేతల సమన్వయ సమావేశాన్ని ఖమ్మంలో పార్టీ ఎన్నికల ఇంచార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ కు హరిప్రియ, డీవీతో పాటు ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధు అటెండ్ అయినట్టు సమాచారం.
గతంలోని విభేదాలన్నీ విడిచిపెట్టి, అందరూ కలిసి పనిచేయాలని వద్దిరాజు రవిచంద్ర సర్ది చెప్పారు. అయితే సోమవారం ఇల్లందులో ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్యే హరిప్రియ నిర్వహించిన భారీ ర్యాలీకి మున్సిపల్ చైర్మన్ డీవీతో పాటు ఆయన వర్గం నేతలు అటెండ్కాలేదు. ర్యాలీ ముగిసిన తర్వాత ఇల్లందులో ఓ టూవీలర్ షోరూం ఓపెనింగ్‌లో మాత్రం ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే హరిప్రియతో కలిసి మున్సిపల్ చైర్మన్ డీవీ పాల్గొనడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. దీంతో అక్కడి నుంచి ఎమ్మెల్యే హరిప్రియ, మున్సిపల్ చైర్మన్ డీవీని తన వాహనంలో ఎక్కించుకున్న ఎంపీ రవిచంద్ర, మళ్లీ వాళ్లిద్దరితో చర్చలు జరిపి సర్దుబాటు చేసే ప్రయత్నం చేశారు.
భద్రాచలం, పాలేరులోనూ అంతే..
భద్రాచలం, పాలేరులోనూ లీడర్ల మధ్య ఒకరితో ఒకరికి పొసగడం లేదు. భద్రాచలం ఇంచార్జీగా తనను తప్పించడంపై ఇప్పటికీ మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ అసంతృప్తితో ఉన్నారు. మరోవైపు పాలేరులో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీని వీడడం ఖాయమైనా, ఆయన వెంట ఉన్న వారిని తిరిగి పార్టీలోనే కంటిన్యూ అయ్యేలా ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చొరవ చూపించడం లేదని తెలుస్తోంది. ఒకవైపు కాంగ్రెస్ బలపడుతుండగా, సొంత నేతలే ఆధిపత్యం కోసం ప్రయత్నించడంతో కేడర్‌కు ఏం చేయాలో తోచడం లేదు.