అన్ని రకాల వైద్య సేవలతో..ప్రతీ నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి

రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలోవంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తామని మంత్రి హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి హరీష్ రావు...ఈ ఏడాది కామారెడ్డిలోనే సూపర్ స్పెషాలిటీ సేవలతో మెడికల్ కాలేజ్ ప్రారంభం కాబోతుందని వెల్లడించారు. ఇది ప్రారంభమైతే  కామారెడ్డి జిల్లా ప్రజలకు వైద్యం కోసం హైదరాబాద్కు వెళ్లా్ల్సిన పని లేదన్నారు. 

గతంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క డయాలసిస్ కేంద్రం కూడా ఉండేది కాదన్నారు. కానీ ఇప్పుడు అన్ని నియోజకవర్గాల్లో డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా డయాలసిస్ పేషెంట్లకు ఉచిత బస్సు పాస్, పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. ప్రభుత్వాసుపత్రిల్లో ప్రాథమిక వైద్యం నుండి సూపర్ స్పెషాలిటీ సేవల వరకు  అన్ని రకాల వైద్య సేవలు ప్రజలకు అందుతున్నాయని చెప్పారు.100కు 63 శాతం డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరుగుతున్నాయని తెలిపారు. కేసిఆర్ కిట్టుతో పాటు గర్భిణులకు కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్నామన్నారు .

తెలంగాణలో గిరిజనులకు 10% రిజర్వేషన్ వల్ల పేద గిరిజన విద్యార్థులకు వైద్య విద్య నేర్చుకునే అవకాశం దొరుకుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. బి కేటగిరి సీట్లలో లోకల్ రిజర్వేషన్ 80% ఇవ్వడం వల్ల స్థానిక విద్యార్థులకు వైద్య విద్య చదువుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. జూన్ 24 నుంచి పోడు భూములకు పట్టాలు అందించబోతున్నామని తెలిపారు. పోడు భూములకు పట్టాలతో పాటు రైతుబంధు, రైతు బీమా కూడా అందించబోతున్నామని స్పష్టం చేశారు.