
సిద్దిపేట, వెలుగు: కేసీఆర్ ఆమరణ దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మంత్రి హరీశ్ రావు అన్నారు. బుధవారం విజయ్ దివస్ సందర్బంగా రంగథాంపల్లి వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి విలేకరులతో మాట్లాడారు. నవంబర్ 29 చరిత్రను మలుపు తిప్పిన రోజు అని అన్నారు. సిద్దిపేట కేంద్రంగా ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ ఆకాంక్షలను కేసీఆర్ నిజం చేశారన్నారు., నాటి సమైక్య పాలకులు కేసీఆర్ పై అనేక కుట్రలకు పాల్పడ్డా వాటిని పటాపంచలు చేశాడని గుర్తు చేశారు. తెలంగాణ టాగ్ లైన్ నీళ్లు, నిధులు, నియామకాలు నిజమైందంటే నాటి కేసీఆర్ పోరాటమే కారణమన్నారు. సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, వేణుగోపాలరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
నేడు చింతమడకకు సీఎం కేసీఆర్
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా గురువారం సీఎం కేసీఆర్ దంపతులు తమ స్వగ్రామమైన చింతమడకకు రానున్నారు. చింతమడక లో తన ఓటు హక్కును వినియోగించడానికి ప్రత్యేక హెలిక్యాప్టర్ లో కేసీఆర్ రానుండటంతో అధికారులు అవసరమైన ఏర్పాట్లను, హెలిపాడ్ ను సిద్దం చేశారు. మంత్రి హరీశ్ రావు బుధవారం చింతమడకలో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు. మథ్యాహ్నం 12 గంటల తరువాత సీఎం కేసీఆర్ చింతమడకకు చేరుకుని ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.