ఏటా పది వేల డాక్టర్లను..ఉత్పత్తి చేస్తున్నం : మంత్రి హరీశ్​రావు

  •     ఖమ్మం మెడికల్​ కాలేజీ ప్రారంభోత్సవంలో మంత్రి హరీశ్​రావు   
  •     మద్దులపల్లిలో ప్రభుత్వ నర్సింగ్ కాలేజీకి శంకుస్థాపన

ఖమ్మం వెలుగు : ఏటా రాష్ట్రంలో 10 వేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేస్తున్నామని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్​రావు చెప్పారు. ధాన్యం, డాక్టర్ల ఉత్పత్తిలో మనమే నంబర్​వన్​ అన్నారు.  జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి, ఎక్కువ మందిని డాక్టర్లను తయారు చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు.  ఖమ్మం జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ బిల్డింగులో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీని మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్​ గురువారం ప్రారంభించారు. అనంతరం మెడికల్ కాలేజీలో ఏర్పాటు చేసిన ల్యాబ్ లు, హాస్టల్, మౌలిక సదుపాయాలను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి ఎంఆర్ఐ స్కానింగ్ మిషన్​ సమకూర్చాలని మంత్రి అజయ్ కోరగా, హరీశ్​రావు త్వరలోనే అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, కలెక్టర్ వి.పి.గౌతమ్, సీపీ విష్ణు.ఎస్. వారియర్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వరరెడ్డి, తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, హరిప్రియ, జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు,

డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మెడికల్​కాలేజీ ప్రిన్సిపాల్ డా. ఎస్. రాజేశ్వరరావు, అధికారులు పాల్గొన్నారు. మంత్రి హరీశ్ పర్యటన సందర్భంగా అంతకు ముందు సిటీలో బీఆర్ఎస్​శ్రేణులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 

త్వరలో పారా మెడికల్​ కాలేజీ ఏర్పాటు చేస్తం

ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ కు ఎంతో ప్రేమ ఉందని, అందుకే ఖమ్మంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ, పాలేరులో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ మంజూరు చేశారని మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్ అన్నారు. గత కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాల హయాంలో కాలేజీల ఏర్పాటు విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. గురువారం మద్దులపల్లిలో రూ.25 కోట్లతో మంజూరైన నర్సింగ్ కాలేజీకి మంత్రులు శంకుస్థాపన చేశారు.

మంత్రి అజయ్ విజ్ఞప్తి మేరకు బీఎస్సీ పారామెడికల్ కాలేజీని త్వరలోనే మంజూరు చేస్తామని హరీశ్​స్పష్టం చేశారు. పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని ప్రతి ఒక్క స్టూడెంట్​చదువులు మధ్యలో ఆపేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫిషరీస్, నర్సింగ్, ఇంజనీరింగ్ కాలేజీలతో నియోజకవర్గం విద్యారంగంలో మరింత ముందుకు వెళ్తుందన్నారు. 

పీడీఎస్​యూ లీడర్ల అరెస్టుపై ఆగ్రహం

మంత్రి హరీశ్​రావు ఖమ్మం పర్యటన నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున ప్రజాపంథాఆఈఈ, పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్, జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్, జిల్లా కార్యదర్శి వెంకటేశ్, పీవైఎల్ జిల్లా కార్యదర్శి రాకేశ్ ను పోలీసులు ముందస్తుగా అరెస్ట్​చేశారు. దీనిని నిరసిస్తూ పీడీఎస్​యూ ఖమ్మం కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం గట్టయ్య సెంటర్ లో ప్రభుత్వ, మంత్రి హరీశ్​రావు దిష్టిబొమ్మను దహనం చేశారు.  

ఘనంగా మమత కాలేజీ  సిల్వర్​జూబ్లీ వేడుకలు

ఖమ్మంలో మమత మెడికల్​కాలేజీ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు అయిన సందర్భంగా గురువారం కాలేజీలో రజతోత్సవం నిర్వహించారు. మంత్రులు హరీశ్​రావు, పువ్వాడ అజయ్​కుమార్​పాల్గొన్నారు. మొదట సిల్వర్​జూబ్లీ బ్లాక్​ను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రులు పాల్గొని మాట్లాడారు. ఎన్నో ఏండ్లుగా పేదలకు అత్యాధునిక వైద్యం అందించిన మమత యాజమాన్యాన్ని, సిబ్బందిని మంత్రి హరీశ్​అభినందించారు. పువ్వాడ అజయ్​కొడుకు నయన్ రాజ్, అజయ్​అన్న కొడుకు నరేన్​రాజ్, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.