రజినీకి అర్థమయ్యింది కానీ ఇక్కడి గజినీలకు అర్థమైతలే: హరీశ్ రావు

తెలంగాణ అభివృద్ధి ఏంటో పక్క రాష్ట్రంలో ఉన్న రజినీ కాంత్ కు అర్థమయ్యింది కానీ ఇక్కడున్న గజినీలకు (ప్రతిపక్షాలకు) అర్థం కావట్లేదని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.   ఏప్రిల్ 28న  విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో హైదరాబాద్ అభివృద్ధిపై  రజినీ కాంత్ ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ ను చూసి  తాను అసలు హైదరాబాద్ లో ఉన్నానా? లేక  న్యూ యార్క్ లో ఉన్నానా? అనిపించిందంటూ వ్యాఖ్యానించారు.  ఈ క్రమంలో రజినీ కాంత్  వ్యాఖ్యలను గుర్తు చేస్తూ మంత్రి హరీశ్ రావు  ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏంటో పక్కా రాష్ట్రం నుంచి వచ్చిన రజినీ కాంత్ కు కనపడింది కానీ ఇక్కడున్న గజినీలకు కనబడటం లేదని సెటైర్ వేశారు. 

 సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ లో   బసవేశ్వర భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ, కాంగ్రెస్  కేసీఆర్ దించేస్తామంటున్నాయని..  అసలు కేసీఆర్ ను ఎందుకు దించాలో చెప్పాలన్నారు. పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన కేసీఆర్ ను  ఎందుకు దించుతారని  ప్రశ్నించారు. రైతుబంధు, కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు నీళ్లిచ్చినందుకు  కేసీఆర్ ను దించుతారా ? అని ప్రశ్నించారు.

లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలని  అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ కు పంపామని హరీశ్ రావు  చెప్పారు. కానీ  ఇక్కడున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఓబీసీలను పట్టించుకోవట్లేదన్నారు. లింగాయత్ లను ఓబీసీలో చేర్చేందుకు కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. బీజేపీ వాళ్లకు చిత్తశుద్ది ఉంటే లింగాయత్ లను ఓబీసీలో చేర్చాలని డిమాండ్ చేశారు.