ఖమ్మం వేదికగా కంటి వెలుగు ప్రారంభించనున్న సీఎం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18న ఖమ్మం వేదికగా సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి హరీష్ రావు ప్రకటించారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, వైద్యాధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన వెంటనే అన్ని జిల్లాల్లో కంటి పరీక్షలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులు వివిధ ప్రాంతాల్లో ప్రారంభించే కంటి వెలుగు కార్యక్రమాల్లో పాల్గొనేలా ముందస్తు కార్యచరణ రూపొందించుకోవాలని హరీష్ రావు చెప్పారు. 

కేసీఆర్ పర్యటనకు ఒకరోజు ముందే అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు కంటి పరీక్షలు నిర్వహించే మిషన్లు, కళ్లద్దాలు, మందుల పంపిణీ జరగాలని హరీష్ రావు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే కుటుంబ సంక్షేమ విభాగానికి రిపోర్టు చేయాలని చెప్పారు. జిల్లాస్థాయి అధికారులతో కూడిన వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకొని సమన్వయం చేసుకోవాలని సూచించారు. ప్రజలకు అవగాహన కల్పించేలా గ్రామాలు, పట్టణాల్లో ఫ్లెక్సీలు, బోర్డులు ఏర్పాటు చేయాలని, స్క్రీనింగ్ లో ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు.