హైదరాబాద్, వెలుగు: ఇటీవల తగ్గించిన ఈపీఎఫ్ వడ్డీరేట్లను పెంచాలని కేంద్రాన్ని కోరుతామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు ఆయన సమాధానం ఇచ్చారు. పీఆర్సీ నివేదికకు అనుగుణంగా ఈహెచ్ఎస్ అమలుపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుందని చెప్పారు. ధరణిలో కొన్ని ఆప్షన్లు ఇచ్చామని, కరోనా టైమ్‌లో పనిచేసిన హెల్త్ సిబ్బందికి రానున్న నియామకాల్లో వెయిటేజీ ఇస్తామని తెలిపారు. చర్చలో ఎంఐఎం సభ్యుడు రియాజ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పీఆర్టీయూ సభ్యుడు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, టాటా మధు, అలుగుబెల్లి నర్సిరెడ్డి, మధుసూధనాచారి తదితరులు మాట్లాడారు. అర్హులై ఉండి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పింఛన్ ఇవ్వాలని రియాజ్ కోరారు. ధరణిలో సమస్యలు పరిష్కారం కోసం ఆప్షన్లకు ఇవ్వాలని, బడుల్లో స్కావెంజర్లను నియమించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రి నర్సింహస్వామినే కాకుండా వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న దేవాలయాలనూ పట్టించుకోవాలని సూచించారు. కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్‌ఫండ్ పెట్టినట్టు చెప్పారు. రాష్ట్రంలో ఒక్కో మనిషిపై సగటున రూ.24,758 సర్కారు ఖర్చు చేస్తుందని, గుజరాత్లో 16 వేలు, యూపీలో 9 వేలు, రాజస్థాన్‌లో 17 వేలు ఖర్చు చేస్తున్నారని తెలిపారు. కాటేపల్లి జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ.. సీపీఎస్‌ను రద్దు చేయాలని, ఈహెచ్ఎస్ స్కీమ్ అమలు చేయాలని కోరారు. అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర స్కీములన్నీ రాష్ట్ర స్కీములకు ఆటంకంగా ఉన్నాయని, కేంద్రం చేసే సాయాన్ని గ్రాంట్ల రూపంలో ఇవ్వాలని కోరారు.
క్లాసులు పెట్టండి: కడియం శ్రీహరి
సభలో ఎట్లుండాలనేదానిపై సభ్యులకు క్లాసులు పెట్టాలని మాజీ మంత్రి కడియం శ్రీహరి కోరారు. ఫైనాన్స్ బిల్లుల మీద ఒక్కరూ మాట్లాడటం లేదన్నారు.