
జనగామ, వెలుగు: ఒక్క చాన్స్అడుగుతున్న కాంగ్రెస్‌కు ఇదివరకు 11 చాన్స్‌లు ఇస్తే ఏం జేసిందని, పొరపాటున మళ్లీ ఇస్తే పాతాళంలో పడతామని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. కాంగ్రెస్ చేయని అభివృద్ధిని11 ఏండ్లు కూడా పూర్తిగాకముందే కేసీఆర్బ్రహ్మాండంగా చేసి చూపారని అన్నారు. జనగామలో ఈ నెల16న సీఎం కేసీఆర్భారీ బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి చీఫ్‌గెస్ట్ గా మంత్రి హరీశ్‌రావు హాజరు కాగా, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్టేషన్ ఘన్పూర్ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడారు. దొంగ రాత్రి కరెంట్, ఎరువుల కొరత, కరువు, కర్ఫ్యూలు, అధ్వాన పాలన కాంగ్రెస్ ట్యాగ్‌లైన్ అయితే ధాన్యం ఉత్పత్తితో పాటు సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్వన్పాలన ఘనత సీఎం కేసీఆర్‌దేనని అన్నారు.
ఈ నెల16న జనగామలో సీఎం కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉంటుందని, దీనికి లక్ష మందికి పైగా జనాలను తరలించాలని మంత్రి హరీశ్ పిలుపునిచ్చారు. జనగామలో పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు ఖరారైపోయిందని మెజారిటీ మీదనే దృష్టి పెట్టాలని అన్నారు. నిన్నటి దాక కాస్త వర్గాలుగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పెద్ద మనసు చేసుకుని పల్లాను ఆశీర్వదించారని అన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చెప్పి ఇంకా చేయాల్సిన పనులను చెప్పి సంతోషంగా అప్పగింతలు చేశాడని అన్నారు. వాళ్లిద్దరూ ఒక్కటైనంక మన మధ్యల లొల్లి ఎందుకని అన్నారు. జనగామ కాంగ్రెస్ టికెట్ కోసం పోటీపడుతున్నవారిలో ఒకరు కన్నతల్లికి అన్నం పెట్టనోళ్లయితే, ఇంకొకరు ఆర్నెళ్లకోసారి కూడా నియోజకవర్గానికి రారని ఎద్దేవా చేశారు. వారిని జనం ఎలా నమ్ముతారని మంత్రి హరీశ్ ప్రశ్నించారు.
కాంగ్రెసోళ్లను నిలదీయాలె : మంత్రి ఎర్రబెల్లి
‘కాంగ్రెసోళ్లు మూర్ఖులు.. గ్రామాల్లోకి వస్తే బజార్లో నిలదీయాలె. ఏం ముఖం పెట్టుకుని ఓట్లడుగుతరు. జనం కోసం పనిచేసింది నాడు ఎన్టీఆర్అయితే నేడు సీఎం కేసీఆర్’ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కార్యకర్తలంతా కలిసి
గట్టుగా పనిచేసి పార్టీని గెలిపించాలన్నారు.
జనగామకు పాలేరుగా పనిచేస్త : పల్లా రాజేశ్వర్ రెడ్డి
సీఎం కేసీఆర్ఆశీస్సులతో, స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పెద్ద మనసుతో జనగామ బరిలో ఉంటున్న. గెలిచిన తర్వాత నియోజకవర్గానికి పాలేరుగా పనిచేస్తానని పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. నెలన్నర మీరు కష్టపడితే ఐదేండ్లు మీ కోసం నేను కష్టాపడతానని ఆయన కార్యకర్తలను ఉద్దేశించి అన్నారు.
ఏ పని ఉన్నా నేరుగా కలువొచ్చని మధ్యవర్తులు అవసరం లేకుండా చేస్తానని అన్నారు. అంతకు ముందు పల్లాకు పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. నియోజకవర్గంలోని కొమురవెళ్లి మల్లన్న ఆలయంలో ఉదయం పూజలు చేసిన పల్లా.. చేర్యాల, బచ్చన్నపేట మీదుగా బైక్ ర్యాలీగా జనగామ చేరుకున్నారు.
లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తం: ముత్తిరెడ్డి
పల్లా రాజేశ్వర్‌రెడ్డిని సీఎం కేసీఆర్జనగామ అభ్యర్థిగా ప్రకటించారని ఆయనను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తామని ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. అంతకు ముందు పల్లా తాను ఒక్కటేనని ఇక పై నియోజక వర్గంలో ఏమున్నా పల్లానే చూసుకుంటారని అన్నారు. తన కంటే ఎక్కువగా జనగామను అభివృద్ధి చేయాలని కోరారు.
పల్లాకు స్వీట్తినిపించి హత్తుకున్నారు. మనమంతా ఒక్కటే అని, నియోజకవర్గంలో తన ఫ్లెక్సీలు పెట్టాల్సిన పనిలేదని తేల్చి చెప్పారు. దీంతో ఆ మాటలు విన్న హరీశ్ రావుతో పాటు మిగతా మంత్రులు ప్రజా ప్రతినిధుల్లో నవ్వులు విరబూశాయి. ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్పాగాల సంపత్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్సీ బోడకుంటి వెంకటేశ్వర్లు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.