
వికారాబాద్ జిల్లా : రాష్ట్ర వైద్య వ్యవస్థపై గవర్నర్ తమిళి సై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి హరీష్ రావు అన్నారు. ఒక డాక్టర్ అయ్యిండి వైద్యుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం చాలా బాధాకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసిస్తుంటే గవర్నర్ మాత్రం విమర్శలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్యసేవలు బాగోలేవని ఎలా అంటారని, ఈ కామెంట్స్ ను తాము తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో వైద్యారోగ్య వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కనీస వసతులు కూడా ఉండవన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో నిర్వహించిన ఆశా కార్యకర్తల సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు. ఇదే కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రరెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ లో ఆయుష్ ఆస్పత్రి
తాండూరు వేదికగా ANM, ఆశా కార్యకర్తలకు చీరెల పంపిణీ కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆశా కార్యకర్తలకు రూ.3000, ఛత్తీస్ గడ్ లో రూ.4000 ఇస్తుంటే.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రూ.9750 అందిస్తోందన్నారు. వికారాబాద్ జిల్లా అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రంగారెడ్డి మూడు జిల్లాలుగా ఏర్పడి.. మూడు మెడికల్ కాలేజీలు కూడా ఏర్పాటు అయ్యాయని అన్నారు. ఈ మధ్యే వికారాబాద్ మెడికల్ కాలేజీకి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారని, మరో వారం రోజుల్లో రూ.30 కోట్ల వ్యయంతో చేపట్టిన నర్సింగ్ కాలేజీని కూడా ప్రారంభిస్తామన్నారు. వికారాబాద్ లో రూ.15 కోట్ల వ్యయంతో 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
బీబీనగర్ ఎయిమ్స్ లో కనీస వసతులు లేవు
వైద్యశాఖలో కొత్త పోస్టుల భర్తీ ప్రక్రియ నడుస్తోందని మంత్రి హరీష్ రావు చెప్పారు. మాతా శిశు మరణాలు తగ్గుదలలో తెలంగాణ అగ్ర స్థానంలో కొనసాగుతోందన్నారు. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంత పురోగతి ఎక్కడా లేదన్నారు. దేశంలోనే వైద్యారోగ్యశాఖలో రాష్ర్టం మూడో స్థానంలో ఉందని చెప్పారు. 2014లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో 30 శాతం మేర ప్రసవాలు జరిగేవని, ఇప్పుడు మాత్రం కేసీఆర్ కిట్, ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తుండడం వల్ల 66 శాతం మేర ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. హెల్త్ అండ్ వెల్ నెస్ ర్యాంకింగ్ లోనూ తెలంగాణ నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యాధికారులు ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయడం వల్లే ఇదంతా సాధ్యమైందన్నారు. ఈ విషయాలు గవర్నర్ తమిళి సైకి ఎందుకు అర్థం కావడం లేదని, అన్ని విషయాలు తెలుసుకుని ఆమె మాట్లాడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రిని సందర్శించాలని, ఆ తర్వాత జిల్లాల్లోని మెడికల్ కాలేజీలను కూడా సందర్శించాలని కోరారు. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ఉన్న సౌకర్యాలు.. 10 శాతం మేర కూడా బీబీనగర్ ఎయిమ్స్ లో లేవన్నారు.